కార్పొరేట్‌కు.. రెడ్ కార్పెట్.. కార్పొరేట్ స్కూళ్ల ఇష్టారాజ్యం
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొన్ని కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యను
దిశ బ్యూరో, కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొన్ని కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యను వ్యాపారంగా మారుస్తున్నాయి. విద్యార్థులకు అక్షరాలు నేర్పేందుకు రూ.లక్షలు వసూళ్లు చేస్తూ అక్రమ వ్యాపారాన్ని సాగిస్తున్నాయి. కట్టడి చేయాల్సిన విద్యాశాఖ అధికారులు కార్పొరేట్ సంస్థలకు రెడ్ కార్పెట్ పరుస్తుండడంతో ఉమ్మడి జిల్లాలో కార్పొరేట్ స్కూళ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. విద్యా సంవత్సరం పూర్తి కాకముందే గత సంవత్సరంలో విద్యార్థుల ఫలితాలను బ్రోచర్లుగా ముద్రిస్తూ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను మభ్యపెడుతూ అడ్మిషన్ల ప్రక్రియ చేపడుతున్నారు. అందుకు ప్రత్యేక పీఆర్ఓలను ఏర్పాటు చేసుకుని పల్లె, పట్టణం అనే తేడా లేకుండా అడ్మిషన్ల కోసం జల్లెడ పడుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు చేసి విసిగిస్తూ బోల్తా కొట్టిస్తున్నారు. తమ కళాశాలలో చేరితే బంగారు భవిష్యత్ అంటూ మెప్పిస్తూ మాయ చేస్తున్నారు.
తమ కళాశాల రాష్ట్రంలోనే టాప్ వన్ పొజిషన్‌లో ఉందని, ఉత్తమ ర్యాంకులు, ఉత్తమ విద్యా బోధనకు పెట్టింది పేరంటూ ఊదరగొడుతున్నారు. మీరు ఊ అనండి.. మీ పిల్లల బంగారు భవిష్యత్తు మా బాధ్యత అంటూ అదరగొడుతున్నారు. మీ పిల్లల కోసం.. ఏసీ నాన్ ఏసీ గదులు ఉన్నాయని, మీరు మీ పిల్లల్ని మా చేతుల్లో పెట్టండని, మీరు ఎంత తొందరగా అడ్మిషన్ తీసుకుంటే అంతా మంచిదంటూ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను బుట్టలో పడేసి అడ్మిషన్ అడ్వాన్స్ పేరుతో రూ.10వేల నుంచి రూ.20వేలవరకు వసూళ్లు చేస్తూ అమాయక జనాన్ని దోచుకుంటున్నారు.
పల్లెలు, పట్టణాలు, పారిశ్రామిక ప్రాంతాలే టార్గెట్...
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కార్పొరేట్ విద్యాసంస్థలు 2023-2024 విద్యా సంవత్సరం ముగియక ముందే గత సంవత్సరం ఫలితాల బ్రోచర్లను ముద్రిస్తు పల్లెలు, పట్టణాలు, పారిశ్రామిక ప్రాంతాల్లో ప్రచారం సాగిస్తూ అడ్మిషన్లు సేకరిస్తున్నారు. ఉదయం 7గంటలకే పీఆర్ఓలు రంగంలోకి దిగి అడ్మిషన్ల పేరుతో విద్యార్థుల తలుపుతడుతున్నారు. మాయమాటలు చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులను బుట్టలో వేసుకుని అడ్మిషన్ అడ్వాన్స్ పేరుతో డబ్బులు లాగేసి
అడ్మిషన్లు పూర్తయ్యాక పీఆర్ఓలు పలాయనం చిత్తగిస్తున్నారు. స్థానికంగా ఉన్న పాఠశాలల యాజమాన్యం నుంచి విద్యార్థుల అడ్రస్సులు, చిరునామాలు తీసుకొని నేరుగా వారి ఇండ్ల వద్దకే వెళ్లి పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడి అడ్మిషన్లు సేకరిస్తున్నారు. ఎవరైనా అడ్మిషన్ తీసుకోకపోతే అక్కడితో ఆగకుండా ప్రతిరోజు ఫోన్ చేస్తూ తమ కళాశాలలో చేరాలంటూ చివరకు ఎలాగోలా ఒప్పించి అడ్మిషన్ తీసుకునేలా చేస్తున్నారు. అయితే అడ్మిషన్లు తీసుకుని తీరా అక్కడికి వెళ్లే సరికి పరిస్థితులు మరోలా ఉంటున్నాయి.
నెల గడవకముందే వేధింపులు...
తీరా అక్కడికి వెళ్తే అడ్మిషన్లు తీసుకున్న పీఆర్వోలు అక్కడ కనిపించరు. వారు చెప్పిన ఆర్భాటాలు అక్కడ ఏ మాత్రం ఉండవు. ఇక పిల్లలను చేర్పించి నెల రోజులు గడవక ముందే కళాశాలల యాజమాన్యాల నుంచి ఫీజులు పేరుతో వేధింపులు మొదలవుతాయి. అటు చూస్తే హాస్టల్‌లో కూడా సరైన భోజనం ఉండక, వసతులు సక్రమంగా లేక పిల్లలు అనారోగ్యాల బారిన పడుతుంటారు. పోనీ విద్యార్థులను తీసుకొద్దామంటే టీసీలు ఇవ్వకుండా వేధిస్తుంటారు. గత్యంతరం లేక తల్లిదండ్రులు రెండేళ్లపాటు ఆ కళాశాల యాజమాన్యం వేధింపులను భరించాల్సి ఉంటుంది. మొదట చెప్పిన ఫీజుల కంటే తర్వాత అదనంగా మరింత ఎక్కువగా వసూలు చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండాలంటే విద్యాశాఖ అధికారులు స్పందించి కార్పొరేట్ కళాశాలల ఆకృత్యాలను అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
కార్పొరేట్ సంస్థలపై చర్యలు తీసుకోవాలి : ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి యుగంధర్
జిల్లాలో కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలు 2023-24 విద్యా సంవత్సరం కాకముందే గత సంవత్సరంలో విద్యార్థుల ఫలితాలను బ్రోచర్లను ముద్రిస్తూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులను మభ్యపెడుతూ అడ్మిషన్ల ప్రక్రియ చేపడుతున్నాయని, సంబంధిత డీఈవో ఇతరత్రా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బావండ్లపల్లి యుగంధర్ ఆరోపించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విద్యాశాఖ అధికారి ఇతర అధికారులు అక్షరాలపై లక్షల వ్యాపారం చేస్తూ కోట్లాది రూపాయలు గడిస్తున్న కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలకు వత్తాసు పలుకుతూ విచ్చలవిడిగా అనుమతులు ఇస్తూ విద్యావ్యవస్థను విద్యాశాఖ అధికారులే పక్కదారి పట్టిస్తున్నారని అన్నారు. కరీంనగర్ జిల్లా విద్యాశాఖ అధికారి కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలకు రెడ్ కార్పెట్ పర్వంలో ముందంజలో ఉన్నారని విమర్శించారు.
జిల్లాలో విచ్చలవిడిగా కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలు పీఆర్వోలు నియమించుకుని 2025-26 విద్యా సంవత్సరానికి కరపత్రాలు ముద్రించి విచ్చలవిడిగా ప్రచారం చేస్తున్నారు. అయినా జిల్లా విద్యాశాఖ అధికారి ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. మరికొన్ని కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలు ఇన్‌కం టాక్స్ పన్ను కట్టకుండా ప్రభుత్వానికి ఎగనామం పెడుతున్నారని అన్నారు. జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలపై ఐటీ అధికారులకు ఫిర్యాదు చేస్తామని అన్నారు. ఇకనైనా జిల్లా విద్యాశాఖ అధికారులు కల్పించుకుని విచ్చలవిడిగా ప్రచారం నిర్వహిస్తున్న సంబంధిత పాఠశాలల యజమాన్యాల అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి సంబంధిత అధికారులపై ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.