పెరుగుతున్న చలి తీవ్రత.. 18 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రత...
ఎల్లారెడ్డిపేట మండలంలో రోజురోజుకి చలి తీవ్రత ఎక్కువ అవుతుంది.
దిశ, ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డిపేట మండలంలో రోజురోజుకి చలి తీవ్రత ఎక్కువ అవుతుంది. గత మూడు రోజుల క్రితం 27 డిగ్రీలుగా ఉన్న ఉష్ణోగ్రత ఒక్కసారిగా ఆదివారం ఉదయం 18 డిగ్రీలకు పడిపోయింది. దీంతో ఉదయం ఎనిమిది గంటల వరకు ఒక్కరు కూడా ఇంట్లో నుండి బయటకు రావడం లేదు. వృద్ధులు చలి తీవ్రతకు తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజూ సాయంత్రం ఆరు గంటల సమయం దాటిందంటే చాలు చలి మొదలవుతుంది. దీంతో చలికి తట్టుకోవడానికి వయోభేదం లేకుండా స్వేటర్లు, చద్దర్లు కొనుగోలు చేస్తున్నారు. దీంతో కొనుగోలు దారులకు డిమాండ్ ఎక్కువ అయింది.
ప్రతిఏటా కార్తీక మాసంలో ఎల్లారెడ్డిపేటలో శ్రీ వేణుగోపాల స్వామి రథోత్సవం సందర్భంగా జరిగే జాతరలో గల దుకాణాలను చలి ఎక్కువ ఉండడంతో ఎనిమిది గంటల వరకు దుకాణాలు తెరవడం లేదు. కార్తీక మాసంలో చలి తీవ్రత ఎక్కువ అవుతుందని అందరికీ తెలిసినా ఇంత కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోతాయని ఊహించలేదని పర్యావరణ ప్రేమికులు పేర్కొంటున్నారు. ఇప్పుడే చలి తీవ్రత ఇట్లా ఉంటే రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో అని మండల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఆస్తమా, శ్వాసకోస వ్యాధులతో బాధపడే వారు చలి తీవ్రతకు నివారణ చర్యలు తీసుకోవాలని ఎల్లారెడ్డి పేట అశ్విని హాస్పిటల్ వైద్యులు జి.సత్యనారాయణ స్వామి, జి.అభినయ్ లు సూచించారు.