ఈ ప్రిన్సిపాల్ మాకొద్దు

మాకు ఈ ప్రిన్సిపాల్ మేడం వద్దు అంటూ జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ ఎంజేపీ గురుకుల పాఠశాల విద్యార్థినులు నిరసనకు దిగారు.

Update: 2024-11-16 10:10 GMT

దిశ, జగిత్యాల కలెక్టరేట్ : మాకు ఈ ప్రిన్సిపాల్ మేడం వద్దు అంటూ జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ ఎంజేపీ గురుకుల పాఠశాల విద్యార్థినులు నిరసనకు దిగారు. శనివారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో గేట్ లోపల నుండి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చిన విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ప్రిన్సిపాల్ మేడంని ట్రాన్స్​ఫర్​ చేయాలని పట్టుబట్టారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ పాఠశాలలో ఏ ఒక్క సమస్యను ప్రిన్సిపాల్ పట్టించుకోవడంలేదని అన్నారు.

    అంతే కాకుండా తమ తల్లిదండ్రులతో సరిగా మాట్లాడనివ్వదని, అడిగిన వారితో అసభ్య పదజాలంతో దురుసుగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. హాస్టల్ కి ఆలస్యంగా వచ్చిన వారి నుండి వందల్లో ఫైన్లు వసూలు చేస్తూ అడిగితే పాఠశాల డెవలప్మెంట్ కి ఖర్చు చేస్తామని చెబుతున్నట్లు విద్యార్థులు వాపోయారు. అంతేకాకుండా ప్రభుత్వం నుండి తమకు వచ్చిన కాస్మోటిక్ చార్జీలు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. స్కూల్ లోని సమస్యలు టీచర్ల పరిధిలో ఉంటే వాటిని పరిష్కరించాలి కానీ పట్టించుకోవడం లేదన్నారు.

    వర్షాకాలం లోనికి నీళ్లు వచ్చి లగేజీలు తడుస్తున్నాయని, పడుకోవడానికి ఇబ్బందిగా ఉందని చెప్పినా వినలేదని, తన రూమ్ లో మాత్రం బేంచీలు వేసుకొని నిద్రపోతదని వివరించారు. మరోవైపు హాస్టల్ లో పనిచేసే సిబ్బందితో సైతం దురుసుగా ప్రవర్తిస్తుందని చెప్పారు. ప్రిన్సిపాల్ ని వెంటనే ట్రాన్స్​ఫర్​ చేయాలని డిమాండ్​ చేశారు. అనంతరం పాఠశాలలో ఉన్న టీచర్లు వచ్చి పిల్లలకు సర్దిచెప్పడంతో తిరిగి హాస్టల్ కు వెళ్లారు. విషయం తెలుసుకున్న జగిత్యాల జిల్లా ఎంజేపీ గురుకులాల కన్వీనర్ సుస్మిత హుటాహుటిన పాఠశాలకు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 


Similar News