కోరుట్లలో రివాల్వర్ కలకలం..
కోరుట్ల పట్టణంలో రివాల్వర్ లభ్యమైన సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
దిశ, జగిత్యాల ప్రతినిధి : కోరుట్ల పట్టణంలో రివాల్వర్ లభ్యమైన సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను జగిత్యాల ఎస్పీ భాస్కర్ వెల్లడించారు. కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన సందరగిరి లక్ష్మి నర్సయ్య (39) అనే వ్యక్తి పండ్ల వ్యాపారం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. వ్యాపారంలో నష్టం రావడంతో అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలనే ఆలోచనకు వచ్చి ముంబైలో నేరచరిత్ర కలిగిన రాజు భాయ్, నారాయణ, రమేష్, పాటిల్, బిట్టు అలియాస్ బంటీలను కలిశాడు.
వారి సహాయంతో ఏడునెలల క్రితం రూ.లక్ష రూపాయలకు రివాల్వర్ కొనుగోలు చేసినట్లుగా తెలిపారు. రివాల్వర్ తో బెదిరిస్తూ సులువుగా డబ్బులు సంపాదించాలని అనుకున్నాడు. ఈ క్రమంలో బుధవారం అయిలాపూర్ నుండి కోరుట్లకు వస్తుండగా రైల్వే బ్రిడ్జి వద్ద వాహనాల తనిఖీలు చేస్తున్న పోలీసులకు చిక్కినట్లు ఎస్పీ తెలిపారు. నిందితుడిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ ప్రవీణ్, ఎస్సై చిర్ర సతీష్ సిబ్బంది సత్తయ్య, కేశవ్, సాగర్ , శ్రీనులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. నిందితుడి పై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అతనికి సహకరించిన మిగతావారు పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు.