‘దారి’ మళ్లిన ఆశ్రమం.. నిర్వహణ ముసుగులో నిర్వీర్యం
లోక కల్యాణం కోసం ఏర్పాటైన సచ్చిదానంద స్వామి ఆశ్రమం

దిశ బ్యూరో, కరీంనగర్ : లోక కల్యాణం కోసం ఏర్పాటైన సచ్చిదానంద స్వామి ఆశ్రమం నిర్వాహకుల దుర్బుద్దితో లోపభూయిష్టంగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వేదికగా నిలవాల్సిన ఆశ్రమాన్ని అక్రమ సంపాదన కు అడ్డాగా మార్చుకున్నారు. వేడుకలు నిర్వహణ పేరిట భక్తులు, వ్యాపారులు ఇచ్చే విరాళాలను సొంత ఖాతాల్లో వేసుకుంటూ నిర్వహణ పేరిట ఆశ్రమ ఉద్దేశ్యాన్ని నిర్వీర్యం చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఆశ్రమం తమ సొంత ఆస్తి అన్నట్టుగా వ్యవహరిస్తున్న నిర్వాహకులు నిబంధనలను పక్కకు పెట్టి ఆస్తులను పెంచుకునే కేంద్రంగా మార్చుకున్నారు. ఆశ్రమ స్థలాల్లో వ్యక్తిగత పశువుల కొట్టాలను ఏర్పాటు చేసి వ్యవసాయ పొలాల్లో పండించిన పంటలను నిల్వ చేసుకునేందుకు ధాన్యాగారంగా మార్చుకున్నారు. ఆశ్రమం నగర శివారులో ఉండటం అక్కడి భూముల ధరలు విపరీతంగా పెరగడంతో నిర్వహకుల బుద్ది ఆశ్రమ ఆక్రమణపై పడిందనే విమర్శలున్నాయి.
రియల్ వెంచర్ల కోసమే లీజు వ్యవహరం
ఆశ్రమ భూముల లీజు పేరుతో ప్రభుత్వ భూమి నుంచి దారి ఏర్పాటు చేసిన ఆశ్రమ నిర్వాహకులు ఆ రహదారి ఏర్పాటు రియల్ ఎస్టేట్ వెంచర్ల ప్రయోజనం కోసమనే ఆరోపణలు ఉన్నాయి. వ్యాపారం కోసం అంటే ఆశ్రమ సభ్యులు అంగీకరించరనే ఆలోచనతో ఒకటే దెబ్బ రెండు పిట్టలు అన్నట్టుగా స్కూల్ యజమానుల నుంచి కోటి రూపాయల లీజు ఒప్పందం చేసుకుని డబ్బులు తీసుకున్న ఆశ్రమ నిర్వాహకులు ఆశ్రమ ఖాతాలో కాకుండా ప్రత్యేక సొసైటీని ఏర్పాటు చేసి ఆ ఖాతాల్లో డబ్బులు జమ చేయడం తో ఆశ్రమ కమిటి సభ్యుల్లో అనుమానాలకు బీజం పడింది. ఇప్పటికీ ఆ డబ్బులు తిరిగి చెల్లించకపోవడం యథేచ్ఛగా ఆశ్రమ గోడలను కూల్చేసి రహదారి ఏర్పాటు చేయడం నిర్వాహకులకు బహుళ ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని ఈ విధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
స్పందించని అధికారులు..
ఆశ్రమ నిర్వహణ పేరిట అక్రమాలకు కేంద్రంగా మార్చుకుని ప్రభుత్వ స్థలాల్లో సైతం దర్జాగా రోడ్డు ఏర్పాటు చేసినప్పటికీ అధికారులు స్పందించకపోవడం పై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్వయంగా ఆశ్రమ సభ్యులే అది ప్రభుత్వ భూమి అక్రమించి రోడ్డు ఏర్పాటు చేస్తున్నారంటూ జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేసినప్పటి ఎలాంటి చర్యలు లేకపోవడంతో దీని వెనుక ఉన్న శక్తులు ఎవరనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఆశ్రమం ఆక్రమణకు కుట్ర
ఆశ్రమం నగర శివారులో ఉండటం అక్కడి భూములకు విపరీత డిమాండ్ పెరగడంతో ఆశ్రమ నిర్వహకులకు ఎలాగైనా ఆశ్రమాన్ని ఆక్రమించుకోవాలనే కుట్రకు తెరలేపారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆశ్రమ ఆలయ ప్రాంగణంలో మరో దేవాలయాన్ని నిర్మించి
దానికి ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటుచేసిన నిర్వాహకులు ప్రత్యేక బ్యాంకు ఖాతాను సైతం ఏర్పాటు చేసి ఆశ్రమానికి వచ్చే విరాళాలను ఆ ఖాతాలో జమ చేస్తున్నట్టు విమర్శలు ఉన్నాయి . కొన్ని సందర్భాల్లో భక్తుల వివరాలు ఇస్తామంటున్న నిర్వాహకులను సంప్రదించగా ఆన్ లైన్ ద్వారా కాకుండా నగదు రూపంలో విరాళాలు ఇవ్వలని సూచించి సేకరించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిర్వహణ పేరిట ఆశ్రమాన్ని నిర్వీర్యం చేస్తు చివరగా ఎలాగైనా ఆక్రమించాలనే దుర్బుద్ధితోనే ఈ తతంగానికి తెరలేపారని ఆశ్రమ సభ్యులు ఆరోపిస్తున్నారు .
ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే క్రిమినల్ చర్యలు : రాజేష్, కొత్తపల్లి తహశీల్దార్
సచ్చిదానంద స్వామి ఆశ్రమ భూమిలో కొంత ప్రభుత్వ భూమి ఉంది. గతంలో కొందరు ఆక్రమించేందుకు ప్రయత్నం చేస్తే అడ్డుకుని హద్దులు వేసాం. అయినప్పటికీ ఆ హద్దులను తొలగించి కొందరు వ్యక్తులు అక్రమంగా దారివేసారని మా దృష్టికి వచ్చింది. క్రిమినల్ చర్యల కోసం మేము పోలీసు శాఖకు ఫిర్యాదు చేసాం. ప్రభుత్వ భూమిని కాపాడుతాం. వారు వేసిన రోడ్డును తొలగించి హద్దులు ఏర్పాటు చేస్తాం. ఆక్రమణకు పాల్పడ్డవారు ఎంతటి వారైనా చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం.