పేరుకే స్మార్ట్ సిటీ.. కాలుష్యపు కోరల్లో కరీంనగర్
న పటారం.. లోన లొటారం అన్న చందంగా మారింది కరీంనగర్ దుస్థితి. పేరుకే స్మార్ట్ సిటీ...

దిశ, కరీంనగర్ టౌన్ : పైన పటారం.. లోన లొటారం అన్న చందంగా మారింది కరీంనగర్ దుస్థితి. పేరుకే స్మార్ట్ సిటీ... కానీ ఎటు చూసినా పేరుకుపోయిన చెత్త, చెత్త నుంచి వెదజల్లే దుర్గంధం నగర ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీనికి తోడు డంపింగ్ యార్డు సమస్య వారిని వెంటాడుతోంది. అక్కడ పేరుకుపోయిన చెత్తను ఇష్టారీతిన తగలబెట్టడంతో దట్టమైన పొగలు వ్యాపించి నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. శ్వాసకోశ సమస్యలతో ఆస్పత్రుల పాలవుతున్నారు.
గుట్టలు గుట్టలుగా చెత్త కుప్పలు..
నగరపాలక సంస్థ శానిటేషన్ సిబ్బంది నిత్యం వివిధ ప్రాంతాల్లో చెత్తను సేకరిస్తుంటారు. అలా సేకరించిన చెత్తను ప్రతిరోజు ఉదయం, సాయంత్రం బైపాస్ రోడ్ లో మానేరును ఆనుకొని ఉన్న డంపింగ్ యార్డ్ కు తరలిస్తారు. అలా తరలించిన చెత్త గుట్టలు గుట్టలుగా పేరుకుపోయి సమస్య ఉత్పన్నమవుతోంది. ఆ చెత్తను ఎప్పటికప్పుడు రీసైక్లింగ్ చేయాల్సిన సిబ్బంది మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఫలితంగా స్థానికులు దుర్గంధంతో పాటు కాలుతున్న చెత్త నుంచి వచ్చే పొగతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.
ఊపిరి తీసుకోలేనంతగా..
తడి, పొడి చెత్తను వేరు చేయకుండా విచ్చలవిడిగా డంపింగ్ యార్డ్ లో పోసి కాలుస్తున్నారు. దీంతో డంపింగ్ యార్డ్ కు ఆనుకుని ఉన్న కాలనీల్లో పెద్ద ఎత్తున పొగ వ్యాపిస్తోంది. ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా మారి స్థానికులు ఆసుపత్రుల పాలవుతున్నారు. డంపింగ్ యార్డ్ నుంచి వచ్చే పొగతో నరకం అనుభవిస్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై స్థానికులు పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ఆందోళనలు చేపట్టారు. అయినా ఎలాంటి స్పందన లేదు. వేసవి కాలంలో ఈ సమస్య మరింత జఠిలమవుతుందని, ప్రజా ప్రతినిధులు, అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు చేపట్టి, తమ ప్రాణాలను కాపాడాలని వారు వేడుకుంటున్నారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతామని వారు హెచ్చరిస్తున్నారు.
ప్రయాణికులకు ఇబ్బందులే..
డంపింగ్ యార్డ్ లో కాలుతున్న చెత్త ద్వారా వచ్చే పొగ సమీప ప్రాంతాలకు వ్యాపించడంతో బైపాస్ మీదుగా వెళ్లే ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతుంది. పొగ వల్ల ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకుండా ప్రమాదాలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంత జరుగుతున్నా.. పాలకవర్గం గానీ అధికారులు గానీ అటువైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. చెత్త సమస్యకు పరిష్కారం చూపిందీ లేదు. ఏళ్ల తరబడి పేరుకుపోయిన చెత్త, 24 గంటలు కాలుతున్న చెత్త నుంచి వ్యాపించే పొగతో స్థానికులు, వాహనదారులు ఎన్నో ఏళ్లుగా నరకయాతన అనుభవిస్తున్నారు.
ఇలా చేస్తే కొంత మేలు..
డంపింగ్ యార్డ్ కు ప్రతిరోజు వచ్చే టన్నుల కొద్ది చెత్తను సెగ్రిగేషన్ మిషన్ల ద్వారా రీసైక్లింగ్ చేయించాలి. దీంతోపాటు తడి చెత్త, పొడి చెత్తను వేరు చేయాలి. పొడి చెత్తలో రీసైక్లింగ్ గా పనికొచ్చే వాటిని విక్రయించాలి. తడి చెత్తను కంపోస్ట్ ఎరువుగా మార్చే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలి. అంతేకాకుండా డంపింగ్ యార్డ్ లో కొన్ని బోర్లు వేసి కాలుతున్న చెత్తను తడపడం వల్ల కాలనీల్లో వ్యాపించే పొగను కొంతలో కొంతవరకైనా నియంత్రించే వీలుంటుంది. ఏదేమైనా చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు డంపింగ్ యార్డ్ నుంచి వెదజల్లే దుర్గంధం, కాలుతున్న చెత్త నుంచి వ్యాపించే పొగ బారి నుంచి స్థానికులను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.