తాగునీటికి ఇబ్బంది లేదు : మంత్రి పొన్నం
తాగునీటి సరఫరా విషయంలో కొందరు నాయకులు కావాలనే అనవసరపు రాద్ధాంతాలు చేస్తున్నారని, వారి మాటలు పట్టించుకోనవసరం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
దిశ, కరీంనగర్ టౌన్ : తాగునీటి సరఫరా విషయంలో కొందరు నాయకులు కావాలనే అనవసరపు రాద్ధాంతాలు చేస్తున్నారని, వారి మాటలు పట్టించుకోనవసరం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఎల్ఎండి, మిడ్ మానేరులలో తాగు, సాగునీటికి సరిపడా నీటి నిల్వలు ఉన్నాయని అన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి మెరుగ్గానే ఉన్నట్లు ఆయన చెప్పారు. లోయర్ మానేరు డ్యాం పరిధిలోని కరీంనగర్ మున్సిపాలిటీ, మిషన్ భగీరథ తాగునీటి అవసరాల కోసం తగినంత నీటిని నిలువ ఉంచుకొని మిగితా నీటిని సాగు నీటి అవసరాల నిమిత్తం కిందకు వదులుతున్నామని పేర్కొన్నారు. గతేడాది ఈరోజు వరకు లోయర్ మానేరు డ్యామ్ లో 5.00 టీఎంసీలు ఉండగా, ఈ ఏడాది 5.700 టీఎంసీలు ఉన్నాయన్నారు. మిడ్ మానేరు డ్యామ్ లో గత సంవత్సరం 8.00 టీఎంసీలు ఉంటే ఈ సంవత్సరం 9.480 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయన్నారు.
లోయర్ మానేరు డ్యామ్ పరిధిలో తాగునీరు అవసరాల కోసం జూలై 31 వరకు సుమారు 6.90 టీఎంసీలు అవసరం పడుతుందని తెలిపారు. మిడ్ మానేరు నుంచి సాగు, తాగు నీరు అవసరాలు పోను సుమారు 3.00 టీఎంసీల నీటిని లోయర్ మానేరు డ్యాంకు వదలడం జరుగుతుందన్నారు. మిడ్ మానేరు డ్యాం నుండి వచ్చిన నీటితో లోయర్ మానేరు డ్యాంలో మొత్తం 8.70 టీఎంసీలు నీరు నిల్వ ఉంటుందన్నారు. సాగు నీటి అవసరాల కోసం ఈ నెల 6 వరకు సుమారు 2500 క్యూసెక్కుల జోన్-2 ఆయకట్టుకు నీటిని సరఫరా చేయనున్నట్లు మంత్రి వివరించారు. జూలై 31 వరకు లోయర్ మానేరు డ్యాంలో తాగునీటి సరఫరాకు అవసరమైన 6.900 టీఎంసీల నీరు నిల్వ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. తాగు నీటి అవసరాల కోసం కరీంనగర్ మున్సిపాలిటీ, మిషన్ భగీరథకు సంబంధించి ఎటువంటి డోకా లేదని స్పష్టం చేశారు. కొందరు నాయకులు కావాలనే తాగునీటి సరఫరా విషయంలో అనవసరపు రాద్ధాంతాలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని అన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని వారికి తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.