రైతును రాజును చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

రైతును రాజును చేయాలనే మాటను నిజం చేసి చూపించాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.

Update: 2024-10-16 07:00 GMT

దిశ, వేములవాడ : రైతును రాజును చేయాలనే మాటను నిజం చేసి చూపించాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం ఆర్ అండ్ ఆర్ కాలనీలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి బుధవారం విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై, టెస్క్యాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆది మాట్లాడుతూ రైతులకు లబ్ది చేకూర్చడానికి వాణిజ్య బ్యాంకులతో సమానంగా సహకార సంఘాలు ఎంతో తోడ్పాటును అందిస్తున్నాయని అన్నారు. సహకార బ్యాంకులతో గ్రామాల్లో ఉపాధి మార్గాలను ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.

బ్యాంక్ చైర్మన్ లు అంకిత భావంతో పని చేయడం వల్లే సహకార బ్యాంక్ లు ఈ స్థాయికి ఎదిగాయని కొనియాడారు. వాణిజ్య బ్యాంక్ లతో ధీటుగా పోటీ పడి సహకార బ్యాంక్ లు ముందుకు వెళ్తున్నాయని, రైతులకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలు ఇస్తూ బాసటగా ఉంటున్నాయని గుర్తు చేశారు. రైతులు సహకార సంఘాల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ముంపు గ్రామాల్లో ఉపాధి మార్గాలకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, ముంపు గ్రామాల సమస్యల పరిష్కారానికి అధికారులతో ఇప్పటికే పలుసమావేశాలు ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. గతంలో ముంపు గ్రామాల్లో బస చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ముంపు గ్రామాల సమస్యల పై పూర్తి అవగాహన ఉందని, త్వరలోనే వాటికి పరిష్కారం లభిస్తుందని అన్నారు.


Similar News