ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కాదు
ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కాదని, క్షణికావేశంలో ప్రాణం తీసుకుంటే కుటుంబాలు రోడ్డున పడతాయని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి అన్నారు.
దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కాదని, క్షణికావేశంలో ప్రాణం తీసుకుంటే కుటుంబాలు రోడ్డున పడతాయని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి అన్నారు. శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డ చేనేత కుటుంబానికి చెందిన అమర్-స్రవంతి పిల్లలకు ఆయన ఆదివారం స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పరామర్శించారు. బాధిత కుటుంబానికి 50 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే జిల్లా కలెక్టర్ తో మాట్లాడి ప్రభుత్వం తరఫున అందించే ఆర్థిక సహాయం ఐదు లక్షల రూపాయల చెక్కును వారికి అందించారు.
ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ బైరీ అమర్-స్రవంతి దంపతులు ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమైన విషయమన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, ముగ్గురు పిల్లలు ఎంత వరకు చదువుకున్నా పూర్తి బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుండి అందే ఎక్స్గ్రేషియా మొదలుకొని అన్ని రకాల సంక్షేమ పథకాలు బాధిత కుటుంబానికి అందించడానికి తన వంతు కృషి చేస్తానన్నారు.
అందరు కూడా మానవతా దృక్పథంతో ఆలోచించి బాధిత కుటుంబానికి అండగా ఉండాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, నాయకులు గడ్డం నరసయ్య, భీమవరం శ్రీనివాస్, బొప్ప దేవయ్య, ఎల్లె లక్ష్మీనారాయణ, వెల్ముల తిరుపతి రెడ్డి, కాముని వనిత, సూర దేవరాజు, కల్లూరి చందన, గోలి వెంకటరమణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.