రామగుండం బీఆర్ఎస్‌లో ముసలం.. రెండు వర్గాలుగా నేతలు
రామగుండం అంటేనే పోరాటాల పురిటి గడ్డ.
దిశ, గోదావరిఖని టౌన్ : రామగుండం అంటేనే పోరాటాల పురిటి గడ్డ. గత పదేళ్లుగా రామగుండం నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులే ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. పెద్దపల్లి జిల్లాలో రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. రాజకీయాలకు తెలంగాణ రాష్ట్రంలోనే కేంద్ర బిందువుగా గోదావరిఖని పారిశ్రామిక ప్రాంత నాయకులు నాయకత్వం వహిస్తారు. భారతీయ రాష్ట్ర సమితి నాయకులు, కార్యకర్తలకు రామగుండం నియోజకవర్గంలో కొదవలేదు. కానీ బీఆర్ఎస్ నాయకులు రెండు వర్గాలుగా విడిపోవడంతో బీఆర్ఎస్ కార్యకర్తల్లో ఉత్సాహం తగ్గింది. రాష్ట్ర పార్టీ కార్యక్రమాలు చేపట్టినప్పుడు ఈ ప్రాంతంలో అంతంతమాత్రంగానే చేయడం కనిపిస్తుంది. త్వరలోనే పంచాయతీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, రామగుండం కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి.
నాయకులు రెండు వర్గాలుగా విడిపోవడంతో కార్యకర్తలు, ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకం సన్నగిల్లుతోంది. కార్యకర్తల్లో పార్టీ మీద నమ్మకం పోవడంతో బీఆర్ఎస్ రాష్ట్ర క్యాడర్ చేపడుతున్న కార్యక్రమాలను నాయకులు ప్రజల్లోకి తీసుకుపోలేక పోతున్నారు. రామగుండంలో ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించేందుకే భారతీయ జనతా పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో కౌశికహరి కేసీఆర్ సమక్షంలో చేరారు. ఎమ్మెల్యే అభ్యర్థి కోరుగంటి చందర్ గెలుపు కోసం కౌశికహరి నిరంతరం కష్టపడినా ఫలితం లేకుండా పోయింది. ఎన్నికల్లో చందర్ ఓటమి పాలయ్యారు. బీఆర్ఎస్ పార్టీ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షుడిగా కోరుగంటి చందర్ కొనసాగుతున్నారు. కొన్ని హామీలతో పార్టీలో చేరిన కౌశిక హరి, చందర్ మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. పార్టీలో ఆధిపత్యం కోసం ఇద్దరు నేతలు పోటీ పడడంతో ఇద్దరి మధ్య దూరం మరింత పెరిగింది. ప్రస్తుతం రామగుండం పగ్గాలు కానీ పెద్దపల్లి జిల్లా అధ్యక్ష పదవులను ఇద్దరు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.
వేర్వేరుగా కార్యక్రమాలు...
ఒకే రోజు ఇద్దరు నాయకులు గోదావరిఖని, రామగుండం లో వేర్వేరుగా కార్యక్రమాలు చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గోదావరిఖని ప్రధాన చౌరస్తా టీబీజీకేఎస్ కార్యాలయంలో కూల్చివేతలకు వ్యతిరేకంగా ఒకరోజు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అదే రోజు రామగుండంలో కౌశిక హరి ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనమని బీఆర్ఎస్ కార్యకర్తలతో పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించి బలాబలాలను నిరూపించుకున్నారు. ప్రస్తుతం కోరుగంటి చందర్ భారతీయ రాష్ట్ర సమితి పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. అదే పదవిని కౌశిక హరి కూడా ఆశిస్తున్నట్లు తెలుస్తుంది. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ నుంచి కౌషిక హరి రామగుండం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయగా సుమారు 2వేల ఓట్ల తేడాతో అతి తక్కువ మెజార్టీతో ఓడిపోయారు. రామగుండం నియోజకవర్గంలో ప్రజలు, యువకులతో కౌశిక హరికి మంచి సంబంధాలు ఉన్నాయి.
రెండు వర్గాల నాయకులకు రాష్ట్ర పార్టీ నాయకత్వంతో మంచి సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. కోరుకంటి చందర్, కౌశిక హరిలు ఒకరి మీద మరొకరు రాష్ట్ర పార్టీకి ఫిర్యాదులు కూడా చేసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో పెద్దల ఆశీస్సులు ఎవరికి ఉంటాయో? ఎవరు రామగుండం రాజకీయాలను నడిపిస్తారోననే ఆసక్తి సర్వత్రా నెలకొన్నది. ఈ వర్గపోరు వలన బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ వర్గపోరు వల్ల రాబోయే ఎన్నికల మీద పడుతుందని కార్యకర్తలు, చోటమోట నాయకులు కలిసిన చోట బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. పార్టీ రాష్ట్ర నాయకులు జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించాలని రామగుండం బీఆర్ఎస్ నాయకులు కోరుతున్నారు.