Train Derailed: నిలిచిపోయిన ఎక్స్ ప్రెస్ రైళ్లు.. ప్రమాదంపై బండి సంజయ్ ఆరా
గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరో 24 గంటల్లో మరమ్మతులు పూర్తవుతాయని అధికారులు తెలిపారు.
దిశ, వెబ్ డెస్క్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెద్దపల్లి - రాఘవాపూర్ వద్ద గూడ్స్ రైలు (Goods Train Derailed) గత రాత్రి పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. అధికారులు మరమ్మతు చర్యలు చేపట్టినా.. ఇప్పటి వరకూ అవి పూర్తికాలేదని తెలుస్తోంది. ఘజియాబాద్ కు స్టీల్ లోడ్ తో వెళ్తున్న గూడ్స్ రైలు లోని 11 బోగీలు పట్టాలు తప్పాయి. ఓవర్ లోడ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు తెలిపారు. కాగా.. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పెద్దపల్లిలో సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ (Sampark Kranti Express), బిజిగిరి షరీఫ్ వద్ద నవజీవన్ ఎక్స్ ప్రెస్ (Navajeevan Express)లు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. రైళ్ల రాకపోకలకు మరో 24 గంటల సమయం పడుతుందని తెలుస్తోంది.
గూడ్స్ రైలు ప్రమాదంపై కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ఆరా తీశారు. రైల్వే అధికారులతో ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.
గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో దక్షిణ మధ్య రైల్వే పెద్దపల్లి మార్గంలో పలు రైళ్లను రద్దు చేసింది. మరికొన్ని రైళ్లను దారి మళ్లించింది. 31 రైళ్లను రద్దు చేయడంతో పాటు.. మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తూ.. ప్రకటన విడుదల చేశారు. ప్రయాణికులు సహకరించాలని రైల్వే అధికారులు విజ్ఞప్తి చేశారు.