Strict action : దిశ ఎఫెక్ట్.. మట్టి అక్రమ తవ్వకాల పై విచారణ..

హుజూరాబాద్ మండలం రంగాపూర్, సిర్సపల్లి శివారులోని పాండవుల గుట్ట సమీపంలో అసైన్డ్ భూమిలో అక్రమంగా మట్టి తవ్వకాల పై అధికారులు స్పందించారు.

Update: 2024-11-06 03:17 GMT

దిశ, హుజూరాబాద్ రూరల్ : హుజూరాబాద్ మండలం రంగాపూర్, సిర్సపల్లి శివారులోని పాండవుల గుట్ట సమీపంలో అసైన్డ్ భూమిలో అక్రమంగా మట్టి తవ్వకాల పై అధికారులు స్పందించారు. "మట్టి మాఫియా దే హవా" "రెచ్చిపోతున్న మట్టి మాఫియా "డీబీఎల్ మాయాజాలం "అక్రమ క్రషర్లతో కరిగిపోతున్న గుట్టలు" శీర్షికలతో దిశలో కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ కథనాల ఆధారంగా అక్రమ మట్టి తవ్వకాలకై కొందరు సంబంధిత అధికారులకు ఫిర్యాదు సైతం చేశారు. దీనికి స్పందించిన అధికారులు మంగళవారం హుజూరాబాద్ ఆర్డీవో రమేష్ బాబు, డిపార్ట్మెంట్ ఆఫ్ మైనింగ్ అండ్ జియాలజీ అసిస్టెంట్ డైరెక్టర్ ఎన్.రామాచారి ఆధ్వర్యంలో తహశీల్దార్ కనకయ్య ,అధికారులు విచారణ చేశారు. పాండవుల గుట్ట సమీపంలో నిర్వహిస్తున్న క్రషర్లు, క్వారీలను పూర్తిగా అధికారులు పరిశీలించారు. శాంభవి, హనుమాన్, ప్రీతి, క్రషర్ల కంపెనీలను డీఫాల్టర్లుగా గుర్తించారు. ఆయా క్రషర్ల ప్యూజులు తొలిగించి, విద్యుత్ కనెక్షన్లు తొలగించేందుకు, తదుపరి చర్యలకు విద్యుత్ శాఖ అధికారులకు సిఫారసు చేశారు.

అలాగే అనుమతి లేకుండా జరిపిన మట్టి తవ్వకాల పై డీబీఎల్ కంపెనీ ఇదివరకే 1.35 కోట్ల రూపాయలు ఫైన్ విధించినట్టు అధికారులు తెలిపారు. డీబీఎల్ కంపెనీ పరిధిలో మట్టి మాఫియా రాత్రివేళ అనధికారికంగా మట్టి సరఫరా జరపకుండా ఉండేందుకు వాహనాలు రాకుండా డీబీఎల్ పరిధిలో చెక్ పోస్ట్, క్వారీ వద్ద కాంపౌండ్ వాల్ నిర్మించి, జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. వాహనాలను గుర్తించి పోలీసులకు, అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని డీబీఎల్ కంపెనీ సిబ్బందిని హెచ్చరించారు. అలాగే ఈటీఎస్ సర్వే చేయాలని సిబ్బందిని ఆదేశించారు. మట్టి తవ్వకాలకు గురైన భూములు రైతులకు అందుబాటులో లేకపోవడంతో పూర్తి విచారణ జరపకుండానే అధికారులు వెనుదిరిగారు. బాధితులంతా వస్తే విచారణ జరిపి, న్యాయం చేస్తామని ఫిర్యాదుదారులు కోడూరి సమ్మయ్య, మాజీ సర్పంచ్ అరెపెల్లి ఎల్లయ్య, కండె తిరుపతికి అధికారులు హామీ ఇచ్చారు.

Tags:    

Similar News