రాజన్న ఆలయాన్ని విస్తరిస్తాంః మంత్రి పొన్నం ప్రభాకర్

Update: 2024-08-28 12:34 GMT

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధిః వేములవాడ రాజరాజేశ్వర స్వామిని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తో కలిసి బుధవారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మంత్రి పొన్నం మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అర్చకులు అద్దాల మండపంలో ఆశీర్వచనం అందించి, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక భక్తులు వచ్చే ఆలయం రాజన్న ఆలయమని, భక్తుల సంఖ్యకు అనుగుణంగా శృంగేరి పీఠం అనుమతితో ఆలయాన్ని విస్తరిస్తామన్నారు. కార్తీక మాసం నుంచి తిరుమల మాదిరిగా నిత్యాన్న దానం ఏర్పాటు చేస్తామని, దానికి దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాజన్న కోడెలకు ఇబ్బంది కలిగితే చర్యలు తీసుకున్నామని, భక్తులు సమర్పించిన కోడెలను ఎలాంటి దుర్వినియోగం కాకుండా రైతులకు ఉచితంగా అందిస్తున్నామని గుర్తుచేశారు. హరిత హోటల్ స్థలాన్ని వినియోగంలోకి తెస్తామన్నారు. ఆలయానికి సంబంధించి ఎలాంటి లోపాలున్నా బహిరంగంగా మా దృష్టికి తీసుకురావాలని కోరారు. అనంతరం వేములవాడ పట్టణంలోని నూతన కేడీసీసీ బ్యాంకు శాఖను ప్రారంభించారు. మంత్రి వెంట కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహజన్, వేములవాడ ఏఎస్పి శేషాద్రిని రెడ్డి, ఆలయ ఈవో వినోద్ రెడ్డితో పాటు పలువురు నాయకులు, అధికారులు ఉన్నారు.


Similar News