roads : వేరే మార్గం కానరాక.. చేసేదేమీ లేక.. నరక ప్రయాణం
నిత్యం వందలాది వాహనాలు ప్రయాణించే ఇందుర్తి జమ్మికుంట రహదారి అత్యంత అధ్వాన స్థితికి చేరుకుంది.
దిశ, ఓదెల : నిత్యం వందలాది వాహనాలు ప్రయాణించే ఇందుర్తి జమ్మికుంట రహదారి అత్యంత అధ్వాన స్థితికి చేరుకుంది. ప్రయాణికుల పాలిట నరకం చూపిస్తుంది. రోడ్డు మొత్తం గుంతల మయమైపోయింది. రోడ్డుపైన అనేకచోట్ల వర్షపు నీరు నిలిచి రోడ్డుపై ప్రయాణించే వాహనదారులకు ప్రమాదకరంగా మారింది. వారి డ్రైవింగ్ నైపుణ్యానికి విషమ పరీక్ష పెడుతోంది. ఏమాత్రం అజాగ్రత్తగా వాహనాన్ని నడిపినా పరలోక ప్రయాణానికి గ్యారెంటీగా వీసా లభిస్తుంది. సుల్తానాబాద్ జమ్మికుంట రహదారిలో ఒక భాగమైన ఈ రోడ్డు గుంపుల నుండి తనుగుల క్రాసింగ్ వరకు ప్రయాణికులకు చుక్కలు చూపెడుతుంది. నిత్యం ప్రజలు తమ అవసరాల కోసం ఆటోలలో అటు జమ్మికుంటకు ఇటుపక్క పొత్కపల్లి రైల్వే స్టేషన్ కు ఈ రోడ్డు పై ప్రయాణిస్తారు. సుల్తానాబాద్, ఓదెల, శ్రీరాంపూర్, జమ్మికుంట, ఇల్లంతకుంట మండలాల్లోని వివిధ గ్రామాల ప్రజలు తమ అవసరాల నిమిత్తం నిత్యం ఈ రోడ్డు పై ప్రయాణిస్తారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ రోడ్డు దారుణంగా చెడిపోయిన స్థితిలోకి చేరింది.
ఇప్పుడు వారి ప్రయాణాలు ప్రశ్నార్థకంగా మారాయి. అత్యవసరంగా ఆటోలలో ప్రయాణించాలంటే వీలు కావడం లేదు. కారులో ప్రయాణించాలంటే నరకమే మరి. గుంతల్లో ఇరుక్కుపోయి గమ్యం చేరుకుంటామో లేదో తెలియని అయోమయ పరిస్థితి నెలకొని ఉంది. ఈ రహదారి నిర్మాణం గత ప్రభుత్వ హాయంలోనే ప్రారంభమైనా ఇప్పటికీ పూర్తి కాకపోవడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా నిర్మాణం పూర్తి కాకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన సమయంలో నాయకులు పోటీలు పడి పాలాభిషేకాలు జరుపుకున్న సందర్భాన్ని గుర్తు చేస్తూ వారి పై మండి పడుతున్నారు. రోడ్డు దుస్థితి పై నోరు మెదపని నాయకుల వైఖరిని తప్పుపడుతూ ఇప్పుడు ఏమైందని ప్రశ్నిస్తున్నారు. ఈ రోడ్డు పై నాయకులు తమ కారులను నడిపి ర్యాలీలు నిర్వహించాలని కోరుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ చూపి వెంటనే ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.