పోలీస్ సిబ్బంది ఆరోగ్యానికి తొలి ప్రాధాన్యత : ఎస్పీ అఖిల్ మహాజన్
పోలీస్ అధికారులు, సిబ్బంది ఆరోగ్యం కోసం మొదటి ప్రాధాన్యత
దిశ, తంగళ్ళపల్లి : పోలీస్ అధికారులు, సిబ్బంది ఆరోగ్యం కోసం మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ పేర్కొన్నారు. శనివారం పోలీస్ అధికారులు, సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని, ఆరోగ్య పరిరక్షణలో భాగంగా జిల్లా ఎస్పీ ప్రత్యేక చొరవతో పోలీస్ అధికారులు, సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వైద్య శిబిరంలో అధికారులకు, సిబ్బందికి, కుటుంబ సభ్యులకు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య సమస్యలు ఉన్న పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని, అప్పుడే విధులు సమర్థంగా నిర్వహించగలరన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బంది ఆరోగ్యమే మా ప్రథమ ప్రాధాన్యత అని, పోలీసులు రాత్రింబవళ్లు పని చేయడంతో పాటు ప్రతి రోజు ఎన్నో ఆటంకాలు ఎదుర్కొంటూ అధిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని తెలిపారు. సిబ్బందికి మద్దతుగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంపులు, యోగా, క్రీడలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరికి ఆరోగ్యమే గొప్ప సంపద అని, ప్రజలకు నిష్కళంకమైన సేవలను అందించడంలో ప్రతి పోలీసు జీవితంలో ఆరోగ్యం ఎలా కీలక పాత్ర పోషిస్తుందో కూడా వివరించారు.
పోలీసులు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని, వైద్యుల సలహాలను పాటించాలని సిబ్బందిని ఆదేశించారు. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు నడక, వ్యాయామం, యోగా వంటివి దినచర్యలో భాగం చేసుకోవాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాధులు ఎంతో వేగంగా విస్తరిస్తున్నాయని వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు తగిన ఆరోగ్య సూచనలు పాటిస్తే ఎంతో మంచిదన్నారు. అధికారులకు, సిబ్బందికి వారి కుటు-ంబ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించిన ఎల్వీ ప్రసాద్, అశ్విని హాస్పిటల్, తారక రామ హాస్పిటల్, కృష్ణ న్యూరో హాస్పిటల్, కొనార్క్ హాస్పిటల్ వైద్యులకు, యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిఐలు కృష్ణ, మొగిలి, శ్రీనివాస్, వీరప్రసాద్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, ఆర్ఐలు యాదగిరి, రమేష్, స్పెషల్ బ్రాంచ్ సిఐ శ్రీనివాస్, ఎస్ఐలు, సిబ్బంది, కుటు-ంబ సభ్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.