వడ్లలోడు ఎత్తమంటే డబ్బుల లోడు ఎత్తుతున్న రేవంత్

రాష్ట్రంలో రైతులు పండించిన వడ్ల లోడు ఎత్తాలని అడిగితే సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో డబ్బుల మూటలు ఎత్తుతున్నాడని మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-11-12 13:38 GMT

దిశ, జగిత్యాల ప్రతినిధి : రాష్ట్రంలో రైతులు పండించిన వడ్ల లోడు ఎత్తాలని అడిగితే సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో డబ్బుల మూటలు ఎత్తుతున్నాడని మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతు సమస్యలపై కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ చేసిన పాదయాత్రకు హరీష్ రావు హాజరై సంఘీభావం ప్రకటించారు. పాదయాత్రలో పాల్గొన్న హరీష్ రావు జగిత్యాలలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ సీఎం రేవంత్ రెడ్డి రైతులను అన్ని విధాలా మోసం చేశారని ఆరోపించారు.

     ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణమాఫీ, రూ.15 వేలు రైతు భరోసా, 500 రూపాయలు బోనస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో సీఎంగా ఉన్న కేసీఆర్ వడ్ల కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు రాకుండా సమీక్ష సమావేశాలు నిర్వహించే వారని గుర్తు చేశారు. 24 గంటల ఉచిత విద్యుత్ రైతులకు అందజేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీదేనని అన్నారు. క్వింటాకు రూ.2200 లతో 500 బోనస్ తో కలిపి రూ.2800 అమ్ముడు పోవాల్సిన ధాన్యం రూ.1800 లకే రైతులు అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

     అసెంబ్లీ ఎన్నికల్లో బాండ్ పేపర్లు, పార్లమెంట్ ఎన్నికల్లో దేవుళ్ల మీద ఒట్టు పెట్టి రేవంత్ ప్రజల్ని మోసం చేశాడంటూ విమర్శించారు. రేవంత్ రెడ్డిని నమ్మి మిత్తిలకు డబ్బులు తీసుకువచ్చి కట్టిన రైతన్నలకు వడ్డీ పెరుగుతుందన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పోలీసులు, విద్యార్థులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారని ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. అన్ని వర్గాలను మోసం చేసిన రేవంత్ రెడ్డి ప్రజలకు ఏం చేయలేకపోయినా ఎమ్మెల్యేలను మాత్రం తూకంలో పెట్టి కొన్నాడని విమర్శించారు.

రైతుల కోసమే డాక్టర్ పాదయాత్ర

కోరుట్ల జగిత్యాల వరకు పాదయాత్ర చేసిన ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ని మాజీ మంత్రి హరీష్ రావు ప్రత్యేకంగా అభినందించారు. దేశానికి అన్నం పెట్టే వెన్నెముక లాంటి రైతులకు కష్టం వస్తే స్పైన్ డాక్టర్ సంజయ్ పాదయాత్ర చేశాడని ప్రశంసించారు. అయితే ఈ పాదయాత్ర కేవలం ట్రైలర్ మాత్రమేనని ముందుంది సినిమా అంటూ మాట్లాడారు. ఈ పాదయాత్రలో మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, బీఆర్ఎస్ అధ్యక్షుడు విద్యాసాగర్ రావు, ఎమ్మెల్సీ ఎల్.రమణతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ జెడ్పీ చైర్మన్లు ఇతర నాయకులు, రైతులు పాల్గొన్నారు.  


Similar News