తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం
మానకొండూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మంగళవారం కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల కేంద్రంలో జరిగింది.
దిశ, మానకొండూరు : మానకొండూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మంగళవారం కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల కేంద్రంలో జరిగింది. బాధిత రైతు రవి తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని దేవంపల్లి గ్రామానికి చెందిన కొయ్యడ రవి (55)కి ఒక తమ్ముడు, ఇద్దరు అక్కా చెల్లెళ్లు ఉన్నారు. గత కొన్ని నెలల క్రితం తండ్రి లచ్చయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. తండ్రి పేరు మీద గ్రామ శివారులో సర్వేనెంబర్ 185 బి,196 సి లో మూడెకరాల 12 గుంటల వ్యవసాయ భూమి ఉంది.
తన తండ్రి పేరు మీద గల భూమిని రవి తమ్ముడు హరీష్ తల్లి రాజమ్మ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించడానికి మూడు రోజుల క్రితం ఆన్లైన్లో స్లాట్ బుక్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న రవి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేయాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయం చుట్టూ మూడు రోజులుగా తిరుగుతున్నాడు. భర్త పేరున భూమి భార్యకు విరాసత్ చేయడానికి కొడుకులతో సంబంధం లేదు కాబట్టి నిబంధన ప్రకారం రాజమ్మ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందని తహసీల్దార్ రాజేశ్వరి తెలిపారు.
తల్లి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి తనకు భూమి దక్కకుండా చేయడానికి తమ్ముడు హరీష్ ప్రయత్నం చేస్తున్నాడని తహసీల్దార్ కు వివరించినప్పటికీ నిలుపుదల చేయకుండా మంగళవారం తల్లి పేరున రిజిస్ట్రేషన్ చేస్తున్నారని తెలుసుకొని మనస్థాపానికి గురైన రవి వెంట తెచ్చుకున్న పురుగుల మందును తహసీల్దార్ కార్యాలయం ఎదుట తాగాడు. కార్యాలయానికి వచ్చిన రైతులు 108 వాహనానికి సమాచారం అందించి కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
రిజిస్ట్రేషన్ చేయలేదు : తహసీల్దార్ రాజేశ్వరి
దేవంపల్లి గ్రామానికి చెందిన కొయ్యెడ రాజమ్మ, తన భర్త లచ్చయ్య మృతి చెందగా అతని పేరున గల 185బి, 196సి సర్వే నెంబర్లో గల 3 ఎకరముల 12 గుంటల భూమిని విరాసత్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి స్లాట్ బుక్ చేసుకుంది. పెద్ద కుమారుడైన రవి రిజిస్ట్రేషన్ నిలిపివేయాలని ఫిర్యాదు చేయగా విచారణ నిమిత్తమై రిజిస్ట్రేషన్ చేయకుండా నిలిపివేశాము.