ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తే ప్రజలు హర్షించరు : ఈటల
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తే ప్రజలు
దిశ,జమ్మికుంట: ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తే ప్రజలు హర్షించరని, ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని కామెంట్ చేయడం, ఆలోచించడం మంచిది కాదని మాజీ మంత్రి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ హితవు పలికారు. గురువారం ఇల్లందకుంట మండలం లక్ష్మాజిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈటల రాజేందర్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో అమలు కాని హామీలు ఎన్నో ఇచ్చిందని, ప్రతిపక్ష పార్టీగా ప్రజల కోసం పని చేయాలని బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి చెప్పుకొచ్చారు. అనేక రకాల అమలు కాని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన ప్రభుత్వం అమలు చేయనప్పుడు ప్రజల పక్షాన నిలబడి కొట్లాడాలని ప్రభుత్వాన్ని దింపే అధికారం ప్రజలకు ఉంటుంది తప్ప పార్టీలకు ఉండదని, అధికారాన్ని ప్రజలే కట్టబెడతారని, నాయకులు, పార్టీలు చరిత్ర నిర్మాతలు కాదని, చరిత్ర నిర్మాతలు ప్రజలే అని పేర్కొన్నారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల మీద ప్రేమ కంటే దళితుల ఓట్ల మీద ప్రేమతో దళిత బంధు పథకాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. హుజురాబాద్ నియోజకవర్గంలో 17 వేల పైచిలుకు దళిత కుటుంబాలు ఉన్నాయని, 14వేల కుటుంబాలకు మాత్రమే దళిత బంధు ఇచ్చారని, ఇందులో చాలా మందికి సగం డబ్బులు వచ్చాయని అన్నారు. వలస వెళ్లిన కుటుంబాలకు పూర్తిస్థాయిలో దళిత బంధు ఇవ్వాలని, దళిత బంధు పథకం కారణంగానే బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిందని, కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని సూచించారు. విలేకరుల సమావేశంలో జమ్మికుంట జడ్పీటీసీ శ్రీరామ్ శ్యామ్, మండల పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి తిరుపతి రెడ్డి, వైస్ ఎంపీపీ జ్యోత్స్న, పార్టీ నాయకులు సురేందర్ రెడ్డి, సర్పంచ్ గురుకుంట్ల సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.