స్ట్రాంగ్ రూం కీస్ మిస్సింగ్ పై కొనసాగుతున్న విచారణ

ధర్మపురి అసెంబ్లీ ఎలక్షన్ పిటిషన్ వ్యవహారంలో స్ట్రాంగ్ రూం కీస్ మిస్ అయిన ఘటనలో హైకోర్టు ఆదేశాల మేరకు విచారణ కొనసాగుతోంది.

Update: 2023-04-17 10:31 GMT

దిశ, జగిత్యాల ప్రతినిధి / కొడిమ్యాల: ధర్మపురి అసెంబ్లీ ఎలక్షన్ పిటిషన్ వ్యవహారంలో స్ట్రాంగ్ రూం కీస్ మిస్ అయిన విషయంలో హైకోర్టు ఆదేశాల మేరకు విచారణ కొనసాగుతోంది.ఈసీఐ నుంచి వచ్చిన అధికారులు జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామంలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో ఎంక్వైరీ చేస్తున్నారు.

విచారణలో భాగంగా జగిత్యాల జిల్లాలో గతంలో కలెక్టర్లు గా పనిచేసిన గుగులోతు శరత్, గుగులోతు రవితో పాటు ప్రస్తుత కలెక్టర్ యాస్మిన్ భాష, అడిషనల్ కలెక్టర్ బీఎస్.లత, ధర్మపురి ఎలక్షన్ అధికారి భిక్షపతి విచారణకు హాజరయ్యారు.ఈసీఐ నుంచి విచారణ జరిపేందుకు గాను ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్, అండర్ సెక్రటరీ సంజయ్ కుమార్, జాయిట్ సెక్రటరీ రవి కిరణ్ వచ్చారు.2018 నుంచి తాజాగా స్ట్రాంగ్ రూం కీస్ మిస్సింగ్ ఘటన వరకు సమగ్రంగా వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం.

విచారణకు వచ్చిన అధికారులను సిబ్బందిని మినహా వేరే వారిని పోలీసులు లోపలికి అనుమతించడం లేదు. ఈసీఐ విచారణ అధికారులకు వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నం చేసిన ధర్మపురి కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా పోలీసులు లోపలికి పంపలేదు. కవర్ చేసేందుకు వచ్చిన మీడియా సిబ్బందికి కూడా ఎంట్రీ లేదని పోలీసులు తేల్చి చెప్పారు. కనీసం 500 మీ. దూరంలో ఉండాలని పోలీసులు సూచించారు. జిల్లా ఎస్పీ భాస్కర్ ఆదేశాలతోనే కళాశాల చుట్టూ పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు తెలిపారు.

న్యాయస్థానంపై పూర్తి నమ్మకం ఉంది: అడ్లూరి లక్ష్మణ్ కుమార్

తనకు న్యాయస్థానంపై పూర్తి నమ్మకం ఉందని కోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటానని అడ్లూరి లక్ష్మణ్ మీడియాకు తెలిపారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా చివరకు న్యాయమే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేసారు. ధర్మపురి ప్రజలు జరిగే పరిణామాలను గమనించాలని తాను పదవి కోసం పోరాటం చేయడం లేదని న్యాయాన్ని గెలిపించేందుకు కోర్టును ఆశ్రయించానని అన్నారు.

Tags:    

Similar News