పేరు మున్సిపాలిటీది... సప్లై ప్రైవేట్ పనులకు
మున్సిపాలిటీ పనుల కోసం అంటూ స్టిక్కర్ అంటించిన టిప్పర్ లో మట్టిని ప్రైవేటు పనులకు తరలించడం చర్చనీయాంశంగా మారింది. జగిత్యాల మున్సిపల్ పరిధిలోని గణేష్ నగర్ లో నిర్మిస్తున్న ఓ షెడ్డు లెవెలింగ్ కోసం ఓ టిప్పర్ లో పెద్ద ఎత్తున మట్టిని తరలిస్తున్నారు.
దిశ, జగిత్యాల కలెక్టరేట్ : మున్సిపాలిటీ పనుల కోసం అంటూ స్టిక్కర్ అంటించిన టిప్పర్ లో మట్టిని ప్రైవేటు పనులకు తరలించడం చర్చనీయాంశంగా మారింది. జగిత్యాల మున్సిపల్ పరిధిలోని గణేష్ నగర్ లో నిర్మిస్తున్న ఓ షెడ్డు లెవెలింగ్ కోసం ఓ టిప్పర్ లో పెద్ద ఎత్తున మట్టిని తరలిస్తున్నారు. అయితే ఆ టిప్పర్ కు మున్సిపల్ పరిధిలోని రోడ్ల నిర్మాణానికి మట్టి సప్లై చేస్తున్నట్లుగా స్టిక్కర్ అంటించారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ వివరణ కోరగా ఆ టిప్పర్ మున్సిపాలిటీకి సంబంధించింది కాదని స్పష్టం చేశారు.
అయితే గతంలో మున్సిపల్ పరిధిలో అవసరాల నిమిత్తం మట్టి తరలింపు కు పర్మిషన్ తీసుకున్నారా? ఒకవేళ తీసుకుంటే అనుమతులు ముగిసిన తర్వాత స్టిక్కర్ ఎందుకు తొలగించలేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మట్టి తరలింపుపై జగిత్యాల అర్బన్ ఎమ్మార్వో ను వివరణ కోరగా తాము మట్టి తరలింపునకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదన్నారు. వెంటనే స్పందించి మట్టి డంప్ చేస్తున్న చోటుకి రెవెన్యూ అధికారులను పంపించగా అప్పటికే మున్సిపాలిటీ స్టిక్కర్ అంటించిన టిప్పర్ వెళ్లిపోయింది. కాగా కొద్దిసేపటికి వచ్చిన మరో రెండు టిప్పర్లను పట్టుకున్న రెవెన్యూ అధికారులు వాటిని ఎమ్మార్వో కార్యాలయానికి తరలించారు.