మున్సిపల్ భూములు అన్యాక్రాంతం.. బల్దియా జాగాల్లో కాంప్లెక్సులు!

జగిత్యాలలోని కొత్త బస్టాండ్ ఇన్‌గేట్ ఎదురుగా ఉన్న మున్సిపల్ పార్క్ జాగా కబ్జా కోరల్లో చిక్కుకుంది. కొన్నేళ్లుగా ఇక్కడ ఉన్న మున్సిపల్ భూమిలో కొందరు వ్యక్తులు షెడ్లు వేసి వారి ఆధీనంలో ఉంచుకున్నారు.

Update: 2024-10-18 02:52 GMT

దిశ, జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ భూములు కబ్జాకు గురవుతున్నాయి. అడిగే వారే లేకపోవడంతో రూ.కోట్లు విలువైన స్థలాలు అన్యాక్రాంతం అవుతున్నాయి. గతంలో చిరు వ్యాపారాల పేరుతో ప్రైమ్ లొకేషన్స్‌లో పాగా వేసిన కొందరు క్రమంగా వాటిని కబ్జా చేసుకున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా షెడ్లు వేసి కొందరు సొంతంగా వ్యాపారాలు చేసుకుంటే.. మరి కొందరు ఏకంగా వాటిని అద్దెకు ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నారు. నెలకు రూ.10వేల నుంచి రూ.20వేల చొప్పున అద్దె వసూలు చేస్తూ మున్సిపల్ ఆదాయానికి గండి కొడుతున్నారు. అడిగే వాళ్లు లేక పోవడంతో ఆక్రమణలకు అడ్డేది అన్నట్లుగా సాగుతున్న ఈ వ్యవహారంలో కొంత రాజకీయ ప్రమేయం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఒత్తిళ్లకు లొంగి మున్సిపల్ అధికారులు కనీసం పట్టించుకున్న పాపాన పోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా ఉన్నతాధికారులు కలుగజేసుకుని కోట్ల రూపాయల విలువ గల బల్దియా భూములను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. అవసరమైన చోట కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణాలు చేపట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇలా చేయడం ద్వారా విలువైన భూములను కబ్జాదారుల భారీ నుంచి కాపాడవచ్చని, అంతే కాకుండా ఆయా ప్రభుత్వ శాఖలకు భారీగా ఆదాయం సమకూరే అవకాశం ఉందని జగిత్యాలవాసులు కోరుతున్నారు.

జగిత్యాల జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీకి చెందిన కొన్ని రిజర్వ్ భూములు కబ్జాకు గురవుతున్నాయి. వీటి గురించి అడిగే వారు కూడా లేకపోవడంతో రూ.కోట్లు విలువ చేసే భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. గతంలో చిరు వ్యాపారాల పేరుతో ప్రైమ్ లొకేషన్స్‌లో పాగా వేసిన కొందరు క్రమంగా వాటిని కబ్జా చేసుకున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా షెడ్లు వేసి కొందరు సొంతంగా వ్యాపారాలు చేసుకుంటే మరి కొందరైతే ఏకంగా వాటిని అద్దెకు ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నారు. నెలకు రూ.10వేల నుంచి రూ.20వేల చొప్పున అద్దె వసూలు చేస్తూ మున్సిపల్ ఆదాయానికి గండి కొడుతున్నారు. అడిగే వాళ్లు లేక పోవడంతో ఆక్రమణలకు అడ్డేది అన్నట్లుగా సాగుతున్న ఈ వ్యవహారంలో కొంత రాజకీయ ప్రమేయం కూడా ఉండడంతో ఒత్తిళ్లకు లొంగి మున్సిపల్ అధికారులు కనీసం పట్టించుకున్న పాపాన పోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా ఉన్నతాధికారులు కలుగజేసుకుని రూ.కోట్ల విలువ గల బల్దియా భూములను కాపాడాలని, అవసరమైన చోట కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణాలు చేపట్టాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

కొత్త బస్టాండ్ సమీపంలో రూ.కోట్లలో విలువ..

జగిత్యాలలోని కొత్త బస్టాండ్ ఇన్‌గేట్ ఎదురుగా ఉన్న మున్సిపల్ పార్క్ జాగా కబ్జా కోరల్లో చిక్కుకుంది. కొన్నేళ్లుగా ఇక్కడ ఉన్న మున్సిపల్ భూమిలో కొందరు వ్యక్తులు షెడ్లు వేసి వారి ఆధీనంలో ఉంచుకున్నారు. జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత భూముల విలువ పెరగడంతోపాటు బస్టాండ్ ఎదురుగా ఉండడం, బిజినెస్ ఏరియా కావడంతో ఇక్కడి నుంచి వారు కదలడం లేదు. అంతే కాకుండా ఇలా ఆక్రమించుకున్న దుకాణాలను కొందరు అద్దెకు ఇస్తూ వేల రూపాయల కిరాయిలు వసూలు చేసుకుంటున్నారు. దీంతో ఎదురుగా ఆర్టీసీ అధికారులు నిర్మించిన కాంప్లెక్స్‌లోని షెటర్లకు డిమాండ్ కూడా పడిపోయిందని తెలుస్తోంది. మరోవైపు మున్సిపాలిటీ కమర్షియల్ కాంప్లెక్ నిర్మిస్తే రూ.లక్షల్లో అద్దెలు వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ఇక్కడ షాపులు ఏర్పాటు చేసుకున్న కొందరు వ్యక్తులకు కాంగ్రెస్ పార్టీకి చెందిన బడా లీడర్ అండదండలు ఉండడంతోనే అధికారులు ఆ భూముల జోలికి వెళ్లరనే అపవాదు లేకపోలేదు.

గొల్లపల్లి రోడ్డులో ట్రాఫిక్ ఇబ్బందులు..

జగిత్యాల ఓల్డ్ బస్టాండ్ నుంచి గొల్లపల్లి రోడ్డులో ఎడమ వైపు రోడ్డు పక్కన ఉన్న షెడ్ల కారణంగా ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది. మరో వైపు ఇక్కడ తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేసుకున్న కొందరు అక్కడి నుంచి కదలడం లేదు. అంతే కాకుండా ఎలాంటి పత్రాలు లేకున్నా అనధికారికంగా దుకాణ సముదాయాలను విక్రయిస్తున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. టీస్టాల్స్, పండ్ల దుకాణదారులు, కేఫ్‌లు నిర్వహిస్తున్నవారు ఇలా చాలా మంది చిరు వ్యాపారులు ఆక్రమణదారులకు ప్రతి నెల అద్దె చెల్లిస్తున్నట్లుగా తెలుస్తోంది. నిత్యం రాక పోకలతో రద్దీగా ఉండడం, హాస్పిటల్ జోన్ కారణంగా అక్రమంగా వెలిసిన దుకాణాలతో రోడ్డు మరింత ఇరుకుగా మారి ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఆక్రమణకు గురైన దుకాణాలు ఖాళీ చేయించడంతోపాటు మరోచోట స్ట్రీట్ వెండర్స్ కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇలా చేస్తే మున్సిపల్ జాగాలు కబ్జా కోరల నుంచి కాపాడడంతోపాటు ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.

కమర్షియల్ కాంప్లెక్స్‌లతో భారీగా ఆదాయం..

జిల్లా కేంద్రంలో మున్సిపల్ భూములతోపాటు ఖాళీగా ఉన్న ఆర్టీసీ, ఇతర రెవెన్యూ భూములను గుర్తించి కమర్షియల్ కాంప్లెక్స్‌లు నిర్మించాలని డిమాండ్లు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ఇలా చేయడం ద్వారా విలువైన భూములను కబ్జాదారుల భారీ నుంచి కాపాడవచ్చు. అంతే కాకుండా ఆయా ప్రభుత్వ శాఖలకు భారీగా ఆదాయం సమకూరే అవకాశం ఉందని, కబ్జాలకు గురి కాకుండా ఉంటాయని జగిత్యాలవాసులు కోరుతున్నారు. అయితే మున్సిపల్ జాగాల కబ్జా వ్యవహారంపై జగిత్యాల మున్సిపల్ కమిషనర్‌ను వివరణ అడిగే ప్రయత్నం చేయగా కమిషనర్ సమ్మయ్యను సీడీఎంఏకు కలెక్టర్ సత్యప్రసాద్ సరెండర్ చేశారు.


Similar News