వడ్డీతో సహా అన్ని చెల్లిస్తా: CM కేసీఆర్‌కు ఈటల వార్నింగ్
సీఎం కేసీఆర్‌కి తెలంగాణ నినాదంతో బంధాలు తెగిపోయాయని బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.
దిశ, జమ్మికుంట: సీఎం కేసీఆర్‌కి తెలంగాణ నినాదంతో బంధాలు తెగిపోయాయని బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. జమ్మికుంట పట్టణంలోని MPR గార్డెన్లో హుజూరాబాద్ నియోజకవర్గ బీజేపీ విస్తృతస్థాయి సమావేశంలో ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. బీజేపీకి భారత్ మాతాకీ జై అనే నినాదం ఎలాగో.. తెలంగాణలో జై తెలంగాణ కూడా అంతే ముఖ్యమని అన్నారు. మానుకొటలో తెలంగాణ ఉద్యమ కారుల మీద రాళ్ళు వేసి.. మా రక్తాన్ని చూసిన వారు కేసీఆర్ చంకన చేరారని ఆరోపించారు. ఆయన పక్కన తెలంగాణ ద్రోహులు ఉన్నారని.. అందుకే TRS పోయి BRS వచ్చిందని అన్నారు. నాకు చేసిన అవమానాలు అన్నీ వడ్డీతో సహా చెల్లించే రోజు వస్తుందని కేసీఆర్‌ను హెచ్చరించారు. బొమ్మల గుడి దగ్గర అన్నదాన కార్యక్రమంలో.. సంస్కార లేనివాళ్ళు.. గతాన్ని మర్చిపోయిన వాళ్ళు.. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన వారు.. చిల్లరగా వ్యవహరించారని మండిపడ్డారు.
కేసీఆర్ బానిసలు వందల మంది హుజూరాబాద్‌లో నన్ను ఓడగొట్టడనికి పని చేశారని అన్నారు. కురుక్షేత్ర యుద్ధంలో కేసీఆర్‌ది కౌరవ పాత్ర అని హుజూరాబాద్ ప్రజల తీర్పునిచ్చారన్నారు. హుజూరాబాద్ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకుని కాపాడుకున్నారని.. మిమ్మల్ని నేను గుండెల్లో పెట్టి చూసుకుంటానని హామీ ఇచ్చారు. ఈటల రాజేందర్ కుంగిపోయాలే కేసీఆర్ వ్యవహరిస్తు్న్నారని.. కానీ నేను ఎలాంటి చర్యలకు కుంగిపోనని చెప్పారు. తనను పోలీసులు కాపాడకున్న.. హుజూరాబాద్ ప్రజలే కాపాడుతారని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ నీ అబ్బా జాగీరు కాదని.. వైఎస్ రాజశేఖర్ రెడ్డినే ఎదిరించానని.. కేసీఆర్ నువ్వు ఓ లెక్క కాదని వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు పోయినా.. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు. కేసీఆర్ కేవలం తన మీదే కాకుండా.. హుజూరాబాద్ నియోజకవర్గం మీద పగబట్టారని ఆరోపించారు.