అబద్ధాల్లో తండ్రిని మించిన మంత్రి కేటీఆర్ : బీజేపీ సీనియర్ నాయకుడు సోమారపు సత్యనారయణ
అబద్ధాలు చెప్పడంలో తండ్రిని మించిన మంత్రి కేటీఆర్ అని బీజేపీ సీనియర్ నాయకుడు సోమారపు సత్యనారయణ ధ్వజమెత్తారు.
దిశ, గోదావరి ఖని : అబద్ధాలు చెప్పడంలో తండ్రిని మించిన మంత్రి కేటీఆర్ అని బీజేపీ సీనియర్ నాయకుడు సోమారపు సత్యనారయణ ధ్వజమెత్తారు. నియోజకవర్గ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సోమవారం నవ నిర్మాణ సభ పేరుతో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన కార్యక్రమంలో రామగుండం ప్రాంతం అభివృద్ధి విషయంలో తండ్రి కేసీఆర్ చారణ వంతు అబద్ధాలు చెబితే కొడుకు కేటీఆర్ భారణ వంతు అబద్ధాలు మాట్లాడాడని అన్నారు.
సభలో ఒక్క నిజం అయిన మాట్లాడుతాడేమోనని అనుకుంటే.. ఒక్క మాట నిజం లేదని ఎద్దేవా చేశారు. గ్యాస్ ధర గురించి మాట్లాడి మహిళలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన కేటీఆర్ గ్యాస్ ధర లో కేంద్రం 25 శాతం వరకు పన్ను విధిస్తే రాష్ట్ర ప్రభుత్వం 55 శాతం పన్ను విధిస్తున్న విషయం తెలియదా అని ప్రశ్నించారు. గ్యాస్ ధర గురించి మాట్లాడే ముందు రాష్ట్రంలో పెంచిన బస్ చార్జీలు, కరెంట్ చార్జీల వల్ల మధ్య తరగతి ప్రజల నడ్డి విరుస్తున్నారని అన్నారు. పెట్రోల్ మీద వ్యాట్ రూపం లో 35 శాతం మరియు అదనంగా 4 శాతం విధిస్తున్నారని దమ్ముంటే వాటిని తగ్గించి అపుడు మాట్లాడాలని సవాల్ విసిరారు.
ఎంత సేపు ప్రధాని మోదీ సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తున్నాడంటూ పచ్చి అబద్ధాలు మాట్లాడే ముందు సింగరేణి లో కేంద్రం వాటా 49 శాతం రాష్ట్ర వాటా 51 శాతం ఉందని తెలుసుకోవాలన్నారు. సుప్రీం కోర్టు వేలం లేకుండా ఏ కంపెనీ కూడా ఇతర గనులను దక్కించుకునే అధికారం లేదని ఆ విషయాన్ని మరిచి ప్రజలకి అబద్ధాలను చెబుతూ పబ్బం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. ఇలా అబద్ధాలు చెప్తూ ప్రజలని ఎంతో కాలం మభ్యపెట్టలేరని రానున్న రోజుల్లో ప్రజలే బీఆర్ఎస్ ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారని అన్నారు.
ఈ సమావేశంలో రామగుండం నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ పిడుగు కృష్ణ ముదిరాజ్, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ మల్లికార్జున్, నాయకులు కిషన్ రెడ్డి, దుబాసి మల్లేష్ లలిత, రాచకొండ కోటేశ్వర్, మామిడి రాజేష్, సునీల్, మధు, మంచికట్ల భిక్షపతి, పత్తి సంజీవ్, నారాయణ రెడ్డి, బద్రి దేవేందర్, మిట్టపల్లి సతీష్, డేవిడ్ రాజ్, రాజేష్ నాయక్, జనార్ధన్, నారాయణ, సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.