కేంద్ర పథకాలతో ప్రజలకు మేలు.. మాజీ ఎంపీ వివేక్
రాంనగర్ లో బీజేపీ ఆధ్వర్యంలో మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు.
దిశ, గోదావరిఖని : రాంనగర్ లో బీజేపీ ఆధ్వర్యంలో మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎంపీ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు రావుల రాజేందర్ లు, నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివేక్ వెంకటస్వామి వివరించారు. డివిజన్ కు వచ్చిన వివేక్ వెంకటస్వామికి శాలువ కప్పి ప్రజలు సన్మానించారు.
అనంతరం వివేక మట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని రాష్ట్రాన్ని 60వేల కోట్ల మిగులు ఆదాయం నుంచి 6లక్షల కోట్ల అప్పులకు తీసుకపోయిన ఘనత కేసీఆర్ ది అని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి 1000 టీఎంసీల నీరు ఇస్తానని కనీసం100 టీఎంసీలు కూడా ఇవ్వడం లేదన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ అమలు చేయలేదని వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ప్రతి ఎకరానికి వివిధ రూపాలలో 18 వేల రూపాయల సబ్సిడీని మోడీ ప్రభుత్వం ఇస్తుందని వివేక్ తెలిపారు.