పెద్దపల్లి ప్రజల చిరకాల స్వప్నం తీరింది..బస్సు డిపో మంజూరు..
పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు
దిశ,పెద్దపల్లి : పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు ఇచ్చిన ఎన్నికల హామీలలో భాగంగా మాట తప్పకుండా పెద్దపల్లి ప్రాంత చిరకాల స్వప్నం అయిన బస్సు డిపో కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇప్పించారు. బస్సు డిపోతో పెద్దపల్లి ప్రాంతంలోని మారుమూల గ్రామాల్లోకి కూడా బస్సు సౌకర్యం రానుంది. పెద్దపల్లి లో పలు గ్రామాల నుండి మండల కేంద్రాలకు అలాగే జిల్లా కేంద్రానికి వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు తీర్చడానికి అహర్నిశలు శ్రమించి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు జీవో నెంబర్ 915 ద్వారా ప్రభుత్వం నుంచి మంజూరు చేయించడం జరిగింది.
గత పదేళ్ల కాలంలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉన్న బస్సు డిపో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం గడవకముందే మంజూరు కావడం అలాగే పెద్దపల్లి నియోజకవర్గంలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరగడం మొదటి సారి అని ప్రజానీకం కాంగ్రెస్ సర్కార్ కు బ్రహ్మరథం పడుతున్నారు. ఎమ్మెల్యే విజయ రమణ రావు పట్టుదలతో ఎట్టకేలకు పెద్దపల్లి ప్రాంత ప్రయాణికులకు గోస తీరనుంది.