రామగుండం, జైపూర్ లో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు నిర్మిస్తాం

రామగుండం, జైపూర్ లో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు నిర్మిస్తాం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.

Update: 2024-12-04 15:55 GMT

దిశ, పెద్దపల్లి : రామగుండం, జైపూర్ లో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు నిర్మిస్తాం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం పెద్దపల్లిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. వయసు మించిపోయి రామగుండంలో థర్మల్ పవర్ ప్రాజెక్టు మూలన పడితే పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. త్వరలోనే ఈ విద్యుత్ ప్రాజెక్టులకు భూమి పూజ చేస్తామని తెలిపారు. సింగరేణి, జెన్కో సంయుక్తంగా రామగుండంలో థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తాయని చెప్పారు. ప్రజా ప్రభుత్వాన్ని దీవించేందుకు పెద్ద ఎత్తున జనం కదిలి రావడం ఆనందంగా ఉందన్నారు. తాము పని చేయడానికి వచ్చామని, ప్రచారం చేయడానికి కాదని అన్నారు.

    కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయడం లేదని, తాము ధర్నాలు చేస్తాం అంటూ సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నాయకులు బురదజల్లే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ఆనాటి యూపీఏ ప్రభుత్వం తెచ్చిన ఉపాధి పనులను 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్ప అభివృద్ధిగా చెప్పుకుందని విమర్శించారు. శ్మశాన వాటిక ప్రారంభించి దండ వేసి, ధాన్యం కొనుగోలు కేంద్రం రిబ్బన్ కట్ చేసి ఇదే అభివృద్ధి అని పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలించిందని వివరించారు. మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని సుమారు ఎనిమిది లక్షల కోట్ల మేరకు అప్పులు చేసిందన్నారు. ఆ అప్పులకు తాము 11 నెలల కాలంలోనే 64 వేల కోట్లు బ్యాంకులకు వడ్డీలు కట్టామని తెలిపారు. ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన 11 నెలల కాలంలోనే 56 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చామన్నారు.

     యువత సాంకేతికంగా బలంగా ఉండాలన్న లక్ష్యంతో 65 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు ప్రారంభించినట్టు తెలిపారు. సింగరేణి కార్మికులకు ప్రమాదం జరిగితే ఆదుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కోటి రూపాయల బీమాను అందుబాటులోకి తెచ్చిందని అన్నారు. రూ.లక్ష కోట్లకు పైగా ప్రభుత్వ నిధులతో నిర్మించిన మేడిగడ్డ, అన్నారం కుంగిపోయాయని, కాలేశ్వరం లేకుండానే కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన శ్రీపాద ఎల్లంపల్లి, ఎస్సారెస్పీ, కడెం, దేవాదుల ప్రాజెక్టుల ద్వారా రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి చేసి ప్రతి గింజను కొనుగోలు చేస్తున్నామని తెలిపారు.

     కాగా యువ వికాసం సభలో 9 వేల మందికి నియామక పత్రాలు అందించారు. బీఆర్ఎస్ పాలనలో పదేళ్లపాటు చిన్న చిన్న ఉపాధి పనులనే పెద్దగా ప్రచారం చేశారని, ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని, తాము 11 నెలల్లోనే 56 వేల ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. ఇంకా కొన్ని క్యాలెండర్ ప్రకారం ఇస్తామన్నాయి. నెల రోజుల వ్యవధిలోనే రైతు రుణమాఫీ కింద రూ.21 వేల కోట్ల నగదు రైతుల ఖాతాల్లో జమ చేశామని పేర్కొన్నారు. కాలేశ్వరం లేకుండానే రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తికి కృషి చేశామన్నారు. రామగుండం, జైపూర్ రెండు ప్రాంతాల్లో థర్మర్​ విద్యుత్ ప్రాజెక్టులు నిర్మిస్తామని చెప్పారు.

యువతకి ఉపాధి అవకాశాలు : మంత్రి పొన్నం

తెలంగాణలో యువతకి స్కిల్స్ మెరుగుపరిచి ఉపాధి అవకాశాలు కల్పించినట్టు మంత్రి పొన్నం ప్రభాకర్​ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఇక్కడి సమస్యలు తెలుసని అన్నారు. విద్యార్థి నాయకుడిగా ఆనాడు ఉద్యోగాలు కావాలని అనేక పోరాటాలు చేశామని, తరువాత కరీంనగర్ పార్లమెంటు సభ్యుడిగా తెలంగాణ ఉద్యమం కోసం అనేక పోరాటాలు చేశామన్నారు.

    గత నెలలో ముఖ్యమంత్రి వేములవాడ వచ్చి ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేశారని, ఇదే జిల్లాల్లో ఉన్న ధర్మపురి లక్ష్మి నరసింహ స్వామి, కొండగట్టు అంజన్న స్వామి లకు కూడా నిధులు మంజూరు చేయాలని కోరినట్టు చెప్పారు. రామగుండంకి విమానాశ్రయం ఇస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. 


Similar News