భూ కబ్జా ఉచ్చులో బీఆర్ఎస్ నేతలు..
సిరిసిల్లలో బీఆర్ఎస్ నేతలు భూ కబ్జా ఉచ్చులో కొట్టుమిట్టాడుతున్నారు. ఒకరి వెనక ఒకరు జైలు పాలు కావడం పరిపాటిగా మారుతోంది.
సిరిసిల్లలో బీఆర్ఎస్ నేతలు భూ కబ్జా ఉచ్చులో కొట్టుమిట్టాడుతున్నారు. ఒకరి వెనక ఒకరు జైలు పాలు కావడం పరిపాటిగా మారుతోంది. కొనసాగుతున్న ఆ పార్టీ నేతల వరుస అరెస్టుల పర్వం కలకలం రేపుతోంది. మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ అనుచరులు చేసిన భూభాగోతాలు ఒక్కొక్కటిగా బహిర్గతం అవుతున్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకొని వందల ఎకరాల ప్రభుత్వ భూములను అసైన్డ్ చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో కబ్జాకు గురైన ప్రభుత్వ భూములపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని ఏడు విలీన గ్రామాలను మొదలుకుని జిల్లా వ్యాప్తంగా దాదాపు 300 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైనట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, తంగళ్లపల్లి ఇలా ఆయా మండలాల్లో బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వ భూమిని అక్రమంగా పట్టా చేయించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే అధికారులు పూర్తి విచారణ చేసి స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో కబ్జాకు పాల్పడిన నేతల పై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ భూమి కబ్జాకు పాల్పడిన బీఆర్ఎస్ నేతల గుండెల్లో గుబులు మొదలైందని ఆ పార్టీ వర్గాలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
దిశ, రాజన్నసిరిసిల్ల ప్రతినిధి : సిరిసిల్లలో బీఆర్ఎస్ నేతలు భూ కబ్జా ఉచ్చులో కొట్టుమిట్టాడుతున్నారు. ఒకరి వెనుక ఒకరు జైలు పాలు కావడం పరిపాటిగా మారుతోంది. కొనసాగుతున్న ఆ పార్టీ నేతల వరుస అరెస్టుల పర్వం కలకలం రేపుతోంది. మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ అనుచరులు చేసిన భూ బాగోతాలు ఒక్కొక్కటిగా బహిర్గతం అవుతున్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకొని వందల ఎకరాల ప్రభుత్వ భూములను అసైన్డ్ చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో కబ్జాకు గురైన ప్రభుత్వ భూములపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలోనే రెవెన్యూ అధికారుల ఫిర్యాదులతో పోలీసులు కబ్జాదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. భారీ భూ కుంభకోణానికి తెరలేపిన బీఆర్ఎస్ నేతల చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ పార్టీ నేతల్లో గుబులు మొదలైనట్లు చర్చ జరుగుతోంది.
కేటీఆర్ అండదండలతోనే కబ్జా...
స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్ అండదండలతోనే తన అనుచరులు జిల్లాలో భారీ భూ కుంభకోణానికి తెర లేపినట్లు తెలుస్తోంది. 2014లో ఆన్సైన్డ్ భూముల కేటాయింపునకు వేసిన కమిటీకి కేటీఆర్ చైర్మన్‌గా వ్యవహరించారు. ఆయన సిఫారసుతోనే జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా సిరిసిల్ల నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 300ఎకరాలకు పైగా భూమిని ఆయన అనుచరుల పేరుపై పట్టా చేసుకోవడమే కాకుండా తమ కుటుంబ సభ్యుల పేరు మీద కూడా పట్టా చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఒక తంగళ్లపల్లి మండలంలోని ఓ గ్రామంలో సుమారు 200 ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైనట్లు వెలుగులోకి వచ్చింది.
అక్రమ భూ కబ్జా పై ప్రభుత్వ నజర్...
సిరిసిల్లలో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూమితోపాటు అక్రమంగా పట్టా చేయించుకున్న కబ్జాదారులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర బీసీ, రవాణాశాఖ మంత్రి జిల్లాలో తన తొలి పర్యటనలోనే జిల్లా కలెక్టరేట్ సాక్షిగా సిరిసిల్లలో అక్రమంగా ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారిని వదిలిపెట్టమని హెచ్చరించారు. అప్పటి నుంచే జిల్లా యంత్రాంగం జిల్లా వ్యాప్తంగా ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూముల చిట్టాలను లెక్కించడం ప్రారంభించింది. ప్రభుత్వ భూమిని పొందిన వారిలో అర్హులు ఉన్నారో, లేక అనర్హులు ఉన్నారో సుదీర్ఘ విచారణ జరిపి ఒకవేళ అక్రమంగా పట్టా చేసుకుంటే వారిపై రెవెన్యూ అధికారులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్నారు.
కొనసాగుతున్న అరెస్టుల పర్వం...
ప్రభుత్వ భూములను టార్గెట్‌గా చేస్తూ అధికారుల అండతో రెవెన్యూ రికార్డులను ట్యాంపరింగ్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు సిరిసిల్లలో వందల ఎకరాల ప్రభుత్వ భూములను కొల్లగొట్టినట్లు తెలుస్తోంది. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారుల ఫిర్యాదులతో సిరిసిల్లలో ప్రభుత్వ భూముల కబ్జాకు పాల్పడిన బీఆర్ఎస్ నేతల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇటీవల కేటీఆర్ ప్రధాన అనుచరుడి అరెస్టు సిరిసిల్లలో కలకలం రేపగా, తాజాగా మరో ఇద్దరు బీఆర్ఎస్ అగ్రనేతల అరెస్ట్ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని సర్దాపూర్‌లో సుమారు 10ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా విషయంలో పట్టణానికి చెందిన అగ్గి రాములు అనే బీఆర్ఎస్ అగ్రనేత, తంగళ్లపల్లి మండలంలోని సారంపల్లి గ్రామంలో మూడెకరాల ప్రభుత్వ భూమి కబ్జా విషయంలో బీఆర్ఎస్ కీలక నేత తమ్ముడు జిందమ్ దేవదాసు అనే ఇద్దరు నేతలను గురువారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అంతేకాకుండా వీరికి సహకరించిన అప్పటి రెవెన్యూ శాఖ అధికారులు ఆర్డీఓ, ఆర్ఐ, వీఆర్వోలపై కూడా పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.
బీఆర్ఎస్ నేతల చుట్టూ బిగిస్తున్న ఉచ్చు
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని ఏడు విలీన గ్రామాలను మొదలుకుని జిల్లా వ్యాప్తంగా దాదాపు 300ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైనట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, తంగళ్లపల్లి ఇలా ఆయా మండలాల్లో బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వ భూమిని అక్రమంగా పట్టా చేయించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే అధికారులు పూర్తి విచారణ చేసి స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో కబ్జాకు పాల్పడిన నేతలపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ భూమి కబ్జాకు పాల్పడిన బీఆర్ఎస్ నేతల గుండెల్లో గుబులు మొదలైందని ఆ పార్టీ వర్గాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. సిరిసిల్లలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నేతల చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్లు తేటతెల్లమవుతుందని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.