ప్రమాదాల నివారణకు కాటమయ్య రక్షక కిట్ దోహదం

గౌడ కార్మికులు ప్రమాదాల బారిన పడకుండా కాటమయ్య రక్షక కవచం కిట్ ఉపయోగపడుతుందని ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.

Update: 2024-10-15 10:07 GMT

దిశ, వేములవాడ : గౌడ కార్మికులు ప్రమాదాల బారిన పడకుండా కాటమయ్య రక్షక కవచం కిట్ ఉపయోగపడుతుందని ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. మంగళవారం వేములవాడ ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలోని నూతన గ్రంథాలయ భవనంలో నిర్వహించిన కాటమయ్య రక్షక కవచ కిట్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝూతో కలిసి గీత కార్మికులకు కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ గీత కార్మికులకు అవసరమైన సహాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

     చెట్టుపై నుంచి జారి పడిపోయి ప్రమాదాల బారిన పడకుండా కాటమయ్య రక్షణ కవచం కిట్లను అందిస్తున్నామని అన్నారు. గౌడ కులస్తులకు ఇప్పటికే పెన్షన్ అందిస్తున్నామని, ప్రమాదాలు జరిగితే పరిహారం అందిస్తున్నామని తెలిపారు. ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టే సమయానికి ఆర్థికంగా రాష్ట్రం బాగా దెబ్బతిన్నదని, ప్రతి నెలా వచ్చే రూ.18 వేల కోట్ల ఆదాయంలో రూ.6 వేల కోట్లు అప్పుల వడ్డీలకే ఖర్చు అవుతుందని అన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమం అంశంలో వెనకాడటం లేదని అన్నారు. ముంపు గ్రామాల ప్రజలకు ఉన్న ఇబ్బందుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

     సామూహికంగా పెద్ద ఎత్తున ఈత చెట్లు పెంచే అవకాశాలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 200 మంది గౌడ కార్మికులకు కాటమయ్య రక్షణ కవచ కిట్లను పంపిణీ చేస్తుందని, ఇందులో భాగంగా వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాలలో ఎంపిక చేసిన 400 మందికి రక్షక కిట్లను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఇది నిరంతర ప్రక్రియ అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజ మనోహర్, అబ్కారీ శాఖ అధికారి పంచాక్షరి, ప్రజా ప్రతినిధులు, లబ్ధిదారులు, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 

Tags:    

Similar News