Karimnagar: ‘బోనస్’పై కన్ను..! భారీ స్కెచ్ కు తెరలేపిన మిల్లర్లు

ధాన్యం కొనుగోళ్లలో అడుగడుగునా రైతులను దగా చేస్తున్న కొంత మంది మిల్లర్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మరో భారీ స్కెచ్ కు తెరలేపారు.

Update: 2024-12-16 02:24 GMT

దిశ బ్యూరో కరీంనగర్ : ధాన్యం కొనుగోళ్లలో అడుగడుగునా రైతులను దగా చేస్తున్న కొంత మంది మిల్లర్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మరో భారీ స్కెచ్ కు తెరలేపారు. రైతులకు నేరుగా ప్రభుత్వం ఇచ్చే బోనస్ ను సైతం కొట్టేసే కుట్రకు తెరలేపారు. అధికారులు సహకరించడంతో అక్రమాలకు తెరలేపుతు రైతుల వద్ద మిల్లర్లు నేరుగా కోనుగోలు చేసిన ధాన్యానికి ఐకేపీ సెంటర్లలో కొనుగోలు చేసినట్టు ట్రక్ షీట్లు వ్రాసి రైతులకు ప్రభుత్వం అందించే బోనస్ ను సైతం నొక్కేసేందుకు యత్నిస్తుండడంపై రైతాంగం మండిపడుతుంది.

అలార్ట్ మెంటు కాక ముందే మిల్లులకు చేరిన దాన్యం..

ప్రభుత్వం రైతుల వద్ద నుండి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లుల వారిగా ఏ మిల్లుకు ఎంత ధాన్యాన్ని ఇవ్వాలంటూ నిర్ణయించి ధాన్యాన్ని అలాట్మెంట్ చేస్తుంది. కానీ ఇక్కడ ప్రభుత్వం అలాట్మెంట్ చేయకముందే మిల్లర్లు ధాన్యాన్ని రైతుల వద్దనుంచి కొనుగోలు చేసి మిల్లులు నింపారు. దీంతో ఐకేపి సెంటర్లకు వడ్లు చేరక ఉన్న ధాన్యం అంత మిల్లుల్లో నిండుకుంది. అయితే మిల్లుల్లో కి చేరిన ధాన్యాన్ని మిల్లర్లు చెప్పిన విధంగా అధికారులు అలాట్మెంట్ చేసి పేపర్ల ద్వారా మాయాజాలం సృష్టించారు .ఇది ఆసరా చేసుకున్న మిల్లర్లు అడుగడుగునా అటు ప్రభుత్వాన్ని ఇటు రైతులను దగా చేసి దర్జాగా అందినకాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

రైతుల వద్ద మిల్లర్లు కొన్న ధాన్యానికి ట్రక్ షీట్లు కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన కొంతమంది మిల్లర్లు గత నెలలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రారంభించకముందే సన్నరకం వడ్లు బీపీటి జైశ్రీరాం రకాలను నేరుగా రైతుల కల్లాల్లో కొనుగోలు చేశారు జమ్మికుంట ప్రాంతానికి చెందిన నాలుగు మిల్లులు సుమారుగా 1550 లారీల ధాన్యాన్ని రైతుల నుండి తక్కువ ధరకు కొనుగోలు చేసి వాయిదా పద్దతిలో రైతులకు చెల్లింపు సైతం చేశారు.కాగా ప్రభుత్వం చెల్లించే మద్దతు ధరకోసం మిల్లర్లకు అధికారులు సహకరించి ఆ ధాన్యాన్ని ఐకేపీ సెంటర్లలో కొనుగోలు చేసినట్టు ట్రక్ షీట్ జారీచేశారు. అయితే మిల్లర్లు కొనుగోలు చేసిన ధాన్యానికి మిల్లర్లకు నేరుగా డబ్బు చెల్లించేందుకు డమ్మి రైతుల వివరాలను నమోదు చేసి ప్రభుత్వం నుండి అదనపు లాభం పొందిన మిల్లర్లు రైతులకు ప్రభుత్వం ఇచ్చే బోనస్ ను సైతం కోట్టేసే కుట్రకు తెరలేపడం ఇప్పుడు వివాదస్పదంగా మారింది.

బోనస్ లో వాటాకోసం రైతులతో మిల్లర్ల లాబీయింగ్

రైతుల వద్ద తక్కువ ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేసిన మిల్లర్లు రైతులకు ప్రభుత్వం ఇచ్చే బోనస్ ను కొట్టేసే ప్రయత్నం జిల్లాలో బెడిసికొడుతుంది . తక్కువ ధరకు కొనుగోలు చేసిన ధాన్యానికి డమ్మీ రైతుల పేర్లతో ప్రభుత్వం చెల్లించే మద్దతు ధరను అక్రమంగా పొందిన మిల్లర్లు ప్రభుత్వం చెల్లించే బోనస్ ను సైతం కొట్టేసేందుకు నేరుగా రైతులకు గాలం వేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే అందుకు రైతులు ససేమిరా అనడంతో అధికారులను రంగంలోకి దించి ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. కనీసం 30 పర్సేంటేజీ అయినా ఇవ్వాలంటూ రైతులతో బేరం ఆడటం ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో కలకలం రేపుతుంది.

వచ్చిన ధాన్యం వచ్చినట్టే మాయం చేస్తున్న మిల్లర్లు

ప్రభుత్వం సీఎంఆర్ అప్పజెప్పేందుకు మిల్లర్లకు పంపిన ధాన్యంతో మిల్లర్లు దర్జాగా వ్యాపారం చేస్తున్నారు. మిల్లులను పర్యవేక్షిస్తు ధాన్యం నిలువలను పరిశీలించాల్సిన అధికారులు అలసత్వం వహిస్తూ మిల్లర్ల అక్రమాలకు సహకరించడంతో దర్జాగా మార్కెట్లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికే సగం ధాన్యం మాయం చేసిన మిల్లర్లు మార్కెట్లో విక్రయించినట్టు ఆరోపణలు వెత్తుతున్నాయి. అధికారులు పర్యవేక్షిస్తూ మిల్లర్లను అరికడితే తప్ప అక్రమ దందా యథేచ్ఛగా సాగిస్తూ మరోమారు ప్రభుత్వానికి కుచ్చుటోపి పెట్టే ప్రమాదం లేకపోలేదు.

Tags:    

Similar News