చొప్పదండిలో విద్యాభివృద్ధికి కృషి..ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించిన ఎమ్మెల్యే

చొప్పదండి నియోజకవర్గం లో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే

Update: 2024-12-16 13:19 GMT

దిశ, గంగాధర: చొప్పదండి నియోజకవర్గం లో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. గంగాధర మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేసి వచ్చే విద్యా సంవత్సరం నుండి ప్రారంభించేలా చూడాలని కోరుతూ సోమవారం సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి వినతి పత్రం సమర్పించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ కళాశాలను చదువుకోవడానికి గంగాధర తో పాటు చుట్టూ ప్రక్కల మండలాల విద్యార్థులు కరీంనగర్, జగిత్యాల పట్టణాలకు వెళ్లాల్సి వస్తోందని, పేద మధ్యతరగతి విద్యార్థులు ఖర్చులు భరించలేక చదువును మధ్యలోనే నిలిపివేస్తున్న విషయాన్ని గతంలో తాము గుర్తించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

చొప్పదండి నియోజకవర్గానికి కేంద్రంగా ఉన్న గంగాధరలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తే గంగాధర తో పాటు, చుట్టూప్రక్కల మండలాల విద్యార్థులకు డిగ్రీ విద్యను అభ్యసించడానికి సులువవుతుందని మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి ప్రత్యేక దృష్టిని సారించినట్లు, ఈ మేరకు మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసి తరగతులు ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి ని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల ఏర్పాటుకు స్పందించిన సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే సత్యం కృతజ్ఞతలు తెలిపారు.


Similar News