Jeevan Reddy : రాజీవ్ గాంధీ విగ్రహా ఏర్పాటుపై ప్రతిపక్షాలది రాద్ధాంతం

సెక్రటేరియట్ లో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు పై ప్రతిపక్షాలు

Update: 2024-09-17 10:13 GMT

దిశ, జగిత్యాల ప్రతినిధి : సెక్రటేరియట్ లో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు పై ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. త్వరలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మేమే ఏర్పాటు చేస్తామని అన్నారు. మంగళవారం ఎమ్మెల్సీ మీడియాతో మాట్లాడుతూ పది ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ తల్లి గుర్తుకు రాలేదా అని ఎద్దేవా చేశారు. ఇక గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతించారు. గల్ఫ్ లో మరణించిన కుటుంబాలకు 5 లక్షల ఎక్స్ గ్రేషియా తో పాటు గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు సంక్షేమ పథకాలలో ప్రాధాన్యత కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మేనిఫెస్టో రూపకల్పనలో భాగంగా గల్ఫ్ కార్మికుల సమస్యలపై రేవంత్ రెడ్డి తో చర్చించినట్లుగా గుర్తు చేశారు. రాష్ట్రంలో నూతన రేషన్ కార్డులు జారీ చేయాల్సిన ఆవశ్యకత ఉందని అయితే రేషన్ కార్డుల మంజూరులో ఒకే విధానాన్ని అనుసరించాలన్నారు.

పట్టణాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన ఖర్చులకు అనుగుణంగా ఒకే వార్షిక ఆదాయాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరారు. ఈ విషయంలో ఇప్పటికే సంబంధిత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సూచనలు చేసినట్లుగా వివరించారు. అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో ఓడి నప్పటికీ ఈ ప్రాంత అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. త్వరలోనే నిజాం షుగర్ ఫ్యాక్టరీలను పునరుద్ధరిస్తామని ప్రకటించారు.అనంతరం ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పేదల సర్కార్ అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా ప్రజాపాలన ఉంటుందన్నారు. ఈ మీడియా సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ అడువాలా జ్యోతి, మాజీ చైర్పర్సన్ విజయలక్ష్మి,పీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బండ శంకర్ తదితరులు పాల్గొన్నారు.


Similar News