Rice harvesters : వరికోతకు యంత్రాల కొరత..

ఖరీఫ్ వరికోతల సీజన్‌ రావడంతో యంత్రాలకు ( Rice harvesters ) డిమాండ్‌ పెరగడంతో పాటు యంత్రాల కొరత ఏర్పడుతోంది.

Update: 2024-10-26 07:59 GMT
దిశ, సైదాపూర్ : ఖరీఫ్ వరికోతల సీజన్‌ రావడంతో యంత్రాలకు ( Rice harvesters ) డిమాండ్‌ పెరగడంతో పాటు యంత్రాల కొరత ఏర్పడుతోంది. జిల్లా వ్యాప్తంగా 2 లక్షల 75 వేల ఎకరాల్లో వరి పంట సాగు కాగా జిల్లావ్యాప్తంగా ఒకేసారి వరి పంట చేతికి రావడంతో యంత్రాలకు డిమాండ్ పెరిగింది. దీంతో ఇదే అదునుగా భావించిన యంత్రాల నిర్వాహకులు గంటకు 3 వేల రూపాయల పైనే డిమాండ్‌ చేస్తుండడంతో అన్నదాతలు చేసేదిలేక అడిగినంతా ఇస్తూ మిన్నకుండిపోతున్నారు. ఒకేసారి వరికోతలు రావడం అకాల వర్షాలతో పంట నేలకొరగడంతో కూలీలతో ( laborers ) కోత పనులు చేయించడం కష్టంగా మారింది. దీంతో పాటు కూలీల డిమాండ్‌ బాగా పెరగటం వలన యంత్రాలపైనే మొగ్గుచూపాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు.
ప్రస్తుతం మండలంలోని సోమారం, వెన్నంపల్లి, ఎక్లాస్పూర్, వెన్కెపల్లి, బొమ్మకల్, అమ్మనగుర్తి, రాయికల్, పెర్కపల్లి, దుద్దెనపల్లి తదితర గ్రామాల్లో వరి పంటను రైతులు వరి కోత పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రతి యేడాది కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఒక్కోసారి వరికోత పనులు ప్రారంభం అయ్యేవి. కానీ ఈ ఖరీఫ్ సీజన్ లో జిల్లా వ్యాప్తంగా వరి పంటలు ఒకేసారి కోతలకు రావడంతో వరి కోత యంత్రాలకు డిమాండ్ భారీగా పెరిగింది. దింతో టైర్ల మిషన్‌, మరికొన్ని ప్రాంతాల్లో (బురదగా ఉన్న ప్రాంతాల్లో) బెల్టుమిషన్లు ( Beltumissions ) వాడేవారు. అయితే ఈ సారి ఇటీవల కురిసిన వర్షాలకు పొలాల్లో నీరు ఉండడంతో టైర్ల మిషన్ల ద్వారా వరి కోత చేసేందుకు వీలు కాక అందరూ బురదలో తిరిగే బెల్టు మిషన్ల పై ఆధారపడ్డారు. దీని వలన ఉన్న అరకొర బెల్టుమిషన్లతో రైతులు రాత్రింబవళ్లు పంటలను కోస్తున్నారు. రాత్రి సమయాల్లో మంచు కారణంగా పంట కోతలు సక్రమంగా జరగక వరి ధాన్యం నేలపాలు అవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News