పరారీలో జగిత్యాల మున్సిపల్ శానిటేషన్ ఉద్యోగి

గత కొంత కాలంగా రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా జగిత్యాల మున్సిపాలిటీలో వెలుగు చూస్తున్న ఘటనలు సంచలనంగా మారుతున్నాయి.

Update: 2024-07-03 14:37 GMT

దిశ, జగిత్యాల ప్రతినిధి : గత కొంత కాలంగా రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా జగిత్యాల మున్సిపాలిటీలో వెలుగు చూస్తున్న ఘటనలు సంచలనంగా మారుతున్నాయి. ఇటీవలే అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఆరోపణల నేపథ్యంలో ఏకంగా కమిషనర్ తో పాటు మున్సిపల్ ఆర్వో భూ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో కమిషనర్ పరారీలో ఉండగా ఆర్వో బడుగు ప్రసాద్ ను పోలీసులు రిమాండ్ కు తరలించారు. ఈ ఘటనతో జగిత్యాల బల్దియాలో అసలు ఏం జరుగుతుంది అన్న ప్రశ్నలు పట్టణంలో తీవ్ర చర్చకు దారి తీశాయి. అయితే తాజాగా అదే తరహాలో మున్సిపల్ శానిటేషన్ లో పని చేసే ఓ ఉద్యోగి పై మెట్ పల్లి పీఎస్ లో కేసు నమోదు అయింది.

    మెట్ పల్లి మున్సిపల్ పరిధిలో గల ఓ భూమికి సంబంధించి తనకున్న పరిచయాలతో సెటిల్మెంట్ చేస్తానని బాధితుల దగ్గర సుమారు రూ.12 లక్షల వరకు జగిత్యాల బల్దియాకు చెందిన సదరు శానిటేషన్ ఉద్యోగి తీసుకున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంలో మరో ఇద్దరు రియల్టర్ల పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తుంది. సెటిల్మెంట్ చేస్తానన్న పని కాకపోవడంతో బాధితులు డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా ఇవ్వకపోవడంతో ఈ విషయం బట్టబయలైంది. ఈ మేరకు బాధితులు పోలీసులను ఆశ్రయించగా సదరు శానిటేషన్ ఉద్యోగి పరారీలో ఉన్నట్లు

     విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు మొదట రెండు రోజుల వ్యక్తిగత లీవ్ పెట్టిన సదరు ఉద్యోగి ఆ తర్వాత 18 రోజుల మెడికల్ లీవ్ కు అప్లై చేశాడు. అయితే బల్దియా అధికారులు లీవ్ అప్రూవల్ చేయనట్లు వినికిడి. అయితే సదరు శానిటేషన్ అధికారిపై ఇదివరకే అవినీతి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు చేపడతారు అన్నది వేచి చూడాల్సి ఉంది.


Similar News