ఇందిరమ్మ కమిటీ నియామకాలలో వారికి చోటు కల్పించాలి.. మంత్రి శ్రీధర్ బాబు

ఇందిరమ్మ కమిటీ నియామకాలలో కష్టపడ్డ కార్యకర్తలకు చోటు కల్పించాలని మంథని ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.

Update: 2024-10-20 05:55 GMT

దిశ, మంథని : ఇందిరమ్మ కమిటీ నియామకాలలో కష్టపడ్డ కార్యకర్తలకు చోటు కల్పించాలని మంథని ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఇంటి స్థలం ఉండి ఇల్లు లేని పేదలకు త్వరలో నియోజకవర్గానికి సుమారు 4 వేల ఇందిరమ్మ ఇండ్లును మంజూరు చేసి పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టి, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక బాధ్యత కమిటీలకు అప్పగించిన విషయం తెలిసిందే. దీనితో ఇందిరమ్మ కమిటీలో గ్రామ ప్రత్యేక అధికారి, కార్యదర్శి, ఇద్దరు మహిళా సంఘాల సభ్యులతో పాటు మరో ముగ్గురికి కమిటీలో చోటు కల్పించనున్నారు. ఇదిలా ఉంటే మంథని నియోజకవర్గంలో ఇందిరమ్మ కమిటీలో నియామకాల పై మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఇందులో భాగంగా శనివారం హైదరాబాదులోని మినిస్టర్ క్వాటర్స్ లో మంథని నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు ఇందిరమ్మ కమిటీలో ఉన్న వారికి రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదని స్పష్టం చేశారు.

ఇందిరమ్మ కమిటీల నియామకాల బాధ్యత మండల పార్టీ అధ్యక్షులదేనని మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, మాజీ సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు ఇందిరమ్మ కమిటీలో సభ్యులుగా నియమించవద్దని ఒకవేళ నియమిస్తే వాటిని రద్దు చేసి మళ్ళీ కొత్త కమిటీలను నియమించాలని ఆదేశించారు. కాంగ్రెస్ పార్టీ జెండా మోసి పార్టీ గెలుపు కోసం కష్టపడ్డ వారికి ఇందిరమ్మ కమిటీలో చోటు కల్పించాలని మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. ఈ నెలాఖరులో నియోజకవర్గానికి 4 వేల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తారని అన్నారు. నిజమైన ఇల్లులేని నిరుపేదలకు మాత్రమే ఇల్లు మంజూరు అయ్యేలా చూడాలని, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవినీతి, అక్రమాలు జరిగినా సహించేది లేదని, చర్యలు తప్పవని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్, మహదేవ్ పూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కోట రాజబాబు, రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రొడ్డ బాపు, కమాన్ పూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైనాల రాజ్, మంథని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆయిలి ప్రసాద్, ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొడ్ల బాలాజీ, కాటరం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేమునూరి ప్రభాకర్ రెడ్డి, పలిమెల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుండబోయిన చిన్నాన్న, మహాముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పక్కల సడువలి, మహాదేవపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అక్బర్ ఖాన్, మలహర్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితల రాజయ్య పాల్గొన్నారు.


Similar News