ప్రజలు వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలి.. కలెక్టర్

జిల్లా ప్రజలు ప్రభుత్వ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపునిచ్చారు.

Update: 2024-10-20 09:05 GMT

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : జిల్లా ప్రజలు ప్రభుత్వ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపునిచ్చారు. సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ నగర్, సుందరయ్యనగర్ లోని అర్బన్ పీహెచ్సీలను కలెక్టర్ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఓపీ, సిబ్బంది రిజిస్టర్, రక్త పరీక్షల ల్యాబ్, ఇన్ పేషెంట్ గదులు, ఆసుపత్రి ఆవరణ, మందులను పరిశీలించారు. అనంతరం దవాఖానాలో ఉన్న పలువురు రోగులతో మాట్లాడారు.

ఫోనులో మాట మంతి..

అంబేద్కర్ నగర్ అర్బన్ పీహెచ్సీ పరిధిలో గత నెలలో ఎన్ని కాన్పులు అయ్యాయో వైద్యాధికారిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు‌. 18 డెలివరీలు అయ్యాయని ఆమె కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కలెక్టర్ పలువురు బాలింతలు, డెలివరీకి ఉన్న గర్భిణులతో ఫోన్లో మాట్లాడారు. ఎక్కడ ఆస్పత్రిలో డెలివరీ అయ్యారో, పాపతో పాటు బాలింత ఆరోగ్య సమాచారాన్ని ఆరా తీశారు. ఆస్పత్రిలో అందిస్తున్న సేవలు, మందుల వివరాలను వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సిబ్బంది అందరూ సమయపాలన పాటించాలని, ప్రభుత్వ వైద్య సేవలు వినియోగించుకునేలా అందరికీ అవగాహన కల్పించాలని సూచించారు. సహజ కాన్పులు అయ్యేలా గర్భిణులకు సలహాలు, సూచనలు శిక్షణ అందించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట వైద్యాధికారి కృష్ణవేణి, ఆయా అర్బన్ పిహెచ్సీల వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


Similar News