ఎల్లారెడ్డిపేటలో దారులను మూసి వేసి నిర్మాణాలు.. పట్టించుకోని అధికారులు
ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో సెట్ బ్యాక్ లేకుండా ఇండ్ల నిర్మాణలు జరుగుతున్నా వాటిని అడ్డుకోవడంలో ఉదాసీనంగా వ్యవరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దిశ, ఎల్లారెడ్దిపేట: ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో సెట్ బ్యాక్ లేకుండా ఇండ్ల నిర్మాణలు జరుగుతున్నా వాటిని అడ్డుకోవడంలో ఉదాసీనంగా వ్యవరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామ పంచాయతీ నిబంధనల మేరకు ఇంటి నిర్మాణం ఫైల్స్ పెట్టి సదరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్మాణం ఫైల్ సమర్పించాల్సి ఉంటుంది. కానీ ఫైల్ సమర్పించందే తడవుగా సదరు ఇంటి యజమానులు ముగ్గు పోసుకొని పిల్లర్లు చుట్టూ గోడలు నిర్మాణం చేసుకుంటున్నారు. గ్రామ పంచాయతీ నిబంధనల ప్రకారం మొఖా మీదకి గ్రామ స్పెషల్ ఆఫీసర్, పంచాయతీ కార్యదర్శిలు విజిట్ చేసి వారి ద్వారా అనుమతి పొందిన తరువాత ఇంటి నిర్మాణాలు చేయాల్సి ఉంది. అవేవి పట్టించుకోకుండా యథేచ్ఛగా ఇంటి నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. ఇంత జరిగినా అధికారులు చూసి చూడనట్లు వ్యవరిస్తున్నారు. కాగా సదరు అధికారులు రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో మొఖా మీదకు రాకుండా అడ్డుకుంటున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. అధికారులు చూసి చూడనట్లు వ్యవరిస్తున్నారనే ఆరోపణలు బహిరంగంగానే వినవస్తున్నాయి.
దారులు మూస్తూ నిర్మాణాలు.. పట్టించుకోని అధికారులు
ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో నివాసముంటున్న ప్రజలు వారి వారి ఇండ్ల ముందు ఉన్న దారులను మూసి వేసి ఇంటి నిర్మాణాలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. వెనుక మార్గంలోకి వెళ్లకుండా ముందు భాగంలో రోడ్డును మూసివేసి నిర్మాణాలు చేస్తుండగా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చేష్టలూడిగి చూస్తున్నారు. ఇంటి నిర్మాణాల కోసం 30 ఫీట్ల రోడ్డుతో నిర్మాణం చేయాల్సి ఉండగా 12 ఫీట్ల లేదా 15 ఫీట్లతో ఇంటి నిర్మాణాలు జరుగుతున్నాయి. ప్రజల నుంచి ఫిర్యాదులు అందిన కానీ పట్టించుకోవడం లేదు. మొఖా మీద గ్రామ పంచాయతీ నిబంధనలు ఉల్లంఘించి కడుతున్నారని క్షేత్ర స్థాయిలో వాటిని కూల్చివేయడంలో అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో గ్రామ ప్రజలకు అంతు చిక్కడం లేదు.
వారికి నోటీసులు ఇస్తాం: గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్
నా దృష్టికి వచ్చిన సమస్యలను క్షేత్ర స్థాయిలో వెళ్లి పరిశీలించడం జరుగుతుంది. రోడ్లు మూసి వెనుక స్థలాలు ఉన్న వారికి వెళ్లకుండా ఇబ్బందులు సృష్టిస్తున్న వారికి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. నోటీసులకు సరైన వివరణ ఇవ్వని వారి మొఖా పైకి వెళ్లి మూసిన రోడ్లను కూల్చివేస్తాం.