Karimnager : వివాదాస్పదంగా మారిన ప్రభుత్వాసుపత్రి నర్సుల డ్యాన్స్
జగిత్యాల(Jagityala) ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుల డ్యాన్సులు(Nurses Dance) వేయటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
దిశ, వెబ్ డెస్క్ : జగిత్యాల(Jagityala) ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుల డ్యాన్సులు(Nurses Dance) వేయటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. డ్యూటీ టైంలో రోగులను గాలికి వదిలేసి చిందులు వేయటం వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వ ఆసుపత్రిలోని ఓ గదిలో ఎక్కువ సౌండ్ పెట్టి క్రిస్మస్(Christamas) వేడుకల్లో భాగంగా డ్యాన్సులు వేశారు. రోగులు ఉన్న వార్డులోనే మధ్య గదిలో పెద్దగా సౌండ్ పెట్టి కోలాటాలు, డ్యాన్సులు వేశారు. గది నుంచి పెద్దగా శబ్ధం, కేరింతలు రావడంతో రోగుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే హాస్పిటల్ ఆర్ఎంవో(RMO) సుమన్‌కు ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఆయన నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్లు తెలిసింది. దీంతో రోగుల బంధువులు మీడియాకు విషయం చెప్పారు. అక్కడకు చేరుకున్న మీడియా ప్రతినిధులు ఘటనపై ఆరా తీశారు. ఆర్ఎంవో సుమన్‌ను వివరణ కోరగా.. ముందస్తు క్రిస్మస్ వేడుకలలో భాగంగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేందుకు తానే పర్మీషన్ ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. రోగులు ఎక్కువ సంఖ్యలో లేకపోవడంతో ఖాళీగా ఉన్నారనే తాను అనుమతి ఇచ్చినట్లు నర్సుల చర్యకు మద్దతు పలికారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు, బోనాల సమయంలో కూడా పూజలు చేశామని, డ్యాన్సులు వేశారని.. అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు అని మీడియాను ప్రశ్నించారు. విషయాన్ని పెద్దది చేయొద్దని సూచించారు. జగిత్యాల హాస్పిటల్ విషయం తెలుసుకున్న జిల్లా అడిషనల్ కలెక్టర్ గౌతమ్ రెడ్డి వెంటనే హాస్పిటల్ చేరుకొని ఘటనపై ఆరా తీశారు. డ్యూటీ టైంలో డ్యాన్సులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. విచారణ పేరుతో కాలయాపన చేయకుండా శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు ఆదేశించారు. హాస్పిటల్‌లో పని లేకపోతే పర్మినెంట్‌గా ఇంటికి వెళ్లిపోవాలని.. అంతే కానీ రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డ్యాన్సులు చేసిన నర్సులకు మెమోలు జారీ చేస్తామన్నారు.