రెచ్చిపోతున్న కబ్జా గ్యాంగ్‌లు.. పోలీస్ బాస్ మారగానే...
కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో మళ్లీ పాత రోజులు రానే వచ్చాయి.

దిశ,బ్యూరో కరీంనగర్ : కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో మళ్లీ పాత రోజులు రానే వచ్చాయి. పోలీస్ బాస్ భయానికి జిల్లాను వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు ఒక్కొక్కరుగా తిరిగి యథాస్థానానికి చేరుకున్నారు. బాస్ మారగానే జిల్లాలో సీన్ రివర్స్ అయ్యింది.రౌడీలు, అక్రమార్కులు, భూ కబ్జాదారులు పొజిష న్‌లోకి వచ్చేసారు. గతంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని జిల్లా ప్రజలను తమ అక్రమాలు, అరాచకాలతో పట్టి పీడించేవారు. మళ్లీ వారు రావడంతో పాత రోజులు పునరావృతం అవుతాయా... భూ కబ్జాలు, రౌడీ యిజా లు మళ్లీ మొదలవుతుందా? అని పలువురు చర్చించుకుంటున్నారు.
మళ్లీ రెచ్చిపోతున్న కబ్జా గ్యాంగ్‌లు..
గత సీపీ అభిషేక్ మహంతి ఉక్కుపాదం మోపడంతో అప్పట్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు రియల్ ఎస్టేట్ మాఫియా గ్యాంగ్ లీడర్లు, వారితో సంబంధం ఉన్న పలువురు రాజకీయ నాయకులు,కబ్జాల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న ప్రభుత్వ అధికారులు ఇతర ప్రైవేటు వ్యక్తులు సైతం అరెస్టయి జైలు ఊచలు లెక్క పెట్టారు. అప్పటి సీపీ ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి సామాన్య జనాలకు ఫిర్యాదు చేయడానికి పూర్తిస్థాయి స్వేచ్ఛను ఇవ్వడంతో భారీ ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దానికి తగ్గట్టుగానే ఎవరిని లెక్క చేయకుండా సీపీ అభిషేక్ మహంతి ఒక్కొక్కరిని వరుసగా అరెస్టు చేస్తూ అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. సీపీ దెబ్బకు కొందరు బడా నాయకులు సైతం కరీంనగర్ ని విడిచిపెట్టి విదేశాల్లో తలదాచుకున్న పరిస్థితి అప్పట్లో నెలకొంది. అయితే టెక్నికల్ కారణాల వల్ల గత సీపీ బదిలీ కావడంతో కొత్తగా గౌస్ ఆలం పోలీస్ కమిషనర్ గా నియమితులయ్యారు. ఇప్పటివరకు సైలెంట్ గా ఉన్న భూ కబ్జా గ్యాంగుల లీడర్లు తిరిగి యాక్టివ్ అవుతున్నట్లుగా సమాచారం.
స్థిరాస్తి వివాదాల్లో బెదిరింపులు..
పోలీస్ బాస్ మారడంతో కరీంనగర్ లో పరిస్థితులు కూడా మారాయి అనే వాదనలు వినిపిస్తున్నాయి. గతం మళ్లీ పునరావృతం అయ్యే సంకేతాలు స్పష్టంగా దర్శన మిస్తున్నాయి. నగర శివారు ప్రాంతాల్లో భూములు ఉన్న వారిని టార్గెట్ చేస్తూ, ఏ చిన్న కారణం కనిపించి నా తిరిగి బెదిరింపుల పర్వానికి తెరతీసినట్టుగా తెలుస్తోంది. అయితే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో అంటకాగే ప్రయత్నం చేసే సదరు లీడర్లు కొందరు కబ్జాదారులు తమకు పలుకుబడి ఉందంటూ సామాన్యులను బెదిరించే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అప్పట్లో నగరం వదిలి దేశం వదిలి పారిపోయిన నాయకులు తిరిగి కొన్ని స్థలాల విషయంలో స్థానికుల కు ఇన్ డైరెక్ట్ గా బెదిరింపులకు దిగుతున్నట్టు సమాచారం.
అయితే ఇలాంటి ఎకనామిక్ అఫేన్స్ ల విషయంలో ఉన్నతాధికారులు ఎంత కఠినంగా ఉంటే పోలీసు శాఖకి అంత మంచి పేరు ప్రజల్లో ఉంటుంది. కొందరు కింది స్థాయి అధికారులు కబ్జాదారులతో కుమ్మక్కైన సామాన్యుడికి న్యాయం చేసే ఉన్నతాధికారులు ఉంటే ఎలాంటి మాఫియా బాస్ లు అయినా సరే తోక ముడవాల్సిందే అంటూ బదిలీపై వెళ్లిన సీపీ అభిషేక్ మహంతి జిల్లాలో పని చేసిన సందర్భంలో ప్రశాంతంగా గడిపాం ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో మళ్ళీ అక్రమార్కులు ల్యాండ్ మాఫియాలు పంజా విసిరితే పరిస్థితి ఏంటి అని పలువురు చర్చించుకుంటున్నారు.