పర్యాటకం.. పరిహాసం

కోరుట్ల మండలం ప్రశాంతతకు, తెలంగాణ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు పట్టుగొమ్మగా విలసిల్లుతోంది. మండలంలో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి.

Update: 2023-06-06 03:10 GMT

దిశ, కోరుట్లరూరల్ : కోరుట్ల మండలం ప్రశాంతతకు, తెలంగాణ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు పట్టుగొమ్మగా విలసిల్లుతోంది. మండలంలో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. నాగులపేటలో సైఫాన్, పైడిమడుగులో మర్రిచెట్టు ఆసియా ఖండంలో రెండవ స్థానంలో నిలిచి గొప్ప పర్యాటక క్షేత్రాలుగా వెలుగొందాయి. అలాగే సంగెం గ్రామంలో పురాతన సంగమేశ్వరాలయం, త్రివేణి సంగమం, వెంకటాపూర్ వెంకటేశ్వర స్వామి ఆలయం గల కొండ, గుమ్లాపూర్ గుట్టపై శ్రీవారి ఆలయం, ఇలా అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. అయితే వీటి నిర్వహణ, అభివృద్ధి విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా భావితరాలకు వీటి గురించి తెలిసే అవకాశం లేకుండా ఉనికిని కోల్పోయే పరిస్థితి తలెత్తింది.

మరుగున పడుతున్న సైఫాన్...

ముఖ్యంగా మండలంలోని నాగులపేట గ్రామంలో ఉన్న అతి అద్భుతమైన కట్టడం సైఫాన్. 1968-72 కాలంలో ఎస్ఆర్ఎస్పీ కాలువ నిర్మాణ సమయంలో నాగులపేట వాగు వల్ల కాలువ పనులకు ఆటంకం కలిగింది. అప్పుడు ప్రఖ్యాత ఇంజనీర్ రామకృష్ణరాజు గొప్ప మేధాశక్తితో రూపుదిద్దుకున్నది ఈ నిర్మాణం. వాగు కింది భాగం నుంచి కాలువ వెళ్లే అద్భుత కట్టడం ఖచ్చితంగా చూసి తీరాల్సిందే. పైన వాగు నీరు పారుతూ కింద నుంచి కాలువ నీరు వెళ్లే ఆ సన్నివేశం మహాద్భుతం. అయితే ఈ సైఫాన్ చాలా రోజుల పాటు మంచి పర్యాటక క్షేత్రంగా ఉండేది. అనేక విద్యాసంస్థల విద్యార్థులు, కుటుంబాలు, పర్యాటకుల తాకిడి ఉండేది. అయితే నిర్లక్ష్యం మూలంగా క్రమంగా దీని గురించి ప్రచారం కరువై, అభివృద్ధి పనులు జరుగక ఇది ఉనికి కోల్పేయే స్థాయికి చేరింది.

కళతప్పుతున్న మర్రి చెట్టు...

మండలం లోని పైడిమడుగు గ్రామము లోని మర్రిచెట్టు 500 ఏళ్ల చరిత్ర కలిగి 5 ఎకరాల్లో విస్తరించింది. ఇది ఆసియా ఖండంలోనే రెండవ పెద్ద వృక్షంగా పేరుగాంచింది. ఈ ప్రదేశానికి కూడా పర్యాటకుల తాకిడి భారీగానే ఉండేది. చెట్టు నీడలో అమ్మవారి ఆలయం, పక్కనే పారే వాగుతో ఈ ప్రదేశం అద్భుతంగా ఉండేది. వేళ్లూనుకుపోయిన ఊడలతో మొదలు ఎక్కడో తెలియకుండా భూ మాతకు వేసిన పందిరిలా ఉండేది. అయితే అధికారుల నిర్వహణలో అలసత్వం, అభివృద్ధిలో నిర్లక్ష్యం వెరసి క్రమంగా ఈ చెట్టు క్షీణ దశకు చేరింది. 2014లో జిల్లా పర్యాటక కేంద్రంగా గుర్తించినా పనులు జరగక అలాగే వెనకబడిపోయింది. ఈ క్రమంలో పలు అగ్నిప్రమాదాలు, ఇతరత్రా కారణాలతో చెట్టు విస్తీర్ణం భారీగా తగ్గిపోయింది. దీంతో పర్యాటకుల సంఖ్య కూడా తగ్గింది. కేవలం అమ్మవారి ఆలయం కోసం వచ్చేవారు తప్ప ఈ చెట్టు గొప్పతనాన్ని చూడడానికి వచ్చే వారి సంఖ్య తగ్గిపోయింది.

ఇప్పటికే ఈ ప్రముఖ ప్రదేశాల చుట్టూ పచ్చని పార్కులు ఏర్పాటు చేసి ఈ ప్రదేశాల విశిష్టతను తెలిపే ఫలకాలను ఏర్పాటు చేసి గత వైభవం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా మార్చితే ఆదాయం కూడా భారీగానే రానుంది. ఇప్పటికైనా పర్యాటక శాఖ ఈ స్థలాలను సర్వే చేసి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని, గత వైభవాన్ని పరిరక్షిస్తూ భావితరాలకు వీటి గొప్పతనం తెలిసేలా చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Tags:    

Similar News