బండి సంజయ్ హిందూ ఏక్తా యాత్ర గ్రాండ్​సక్సెస్.. కాషాయ సంద్రంగా కరీంనగర్

హనుమాన్​ జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్​ ఎంపీ బండి సంజయ్​ ఆధ్వర్యంలో కరీంనగర్​లో ఆదివారం నిర్వహించిన హిందూ ఏక్తా యాత్ర గ్రాండ్​ సక్సెస్​ అయింది.

Update: 2023-05-15 03:02 GMT

దిశ, కరీంనగర్​ బ్యూరో/ కరీంనగర్ ​: హనుమాన్​ జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్​ ఎంపీ బండి సంజయ్​ ఆధ్వర్యంలో కరీంనగర్​లో ఆదివారం నిర్వహించిన హిందూ ఏక్తా యాత్ర గ్రాండ్​ సక్సెస్​ అయింది. యాత్రలో పాల్గొనడానికి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున హిందువులు తరలిరాగా వైశ్య భవన్​ నుంచి కాషాయ దండు కదిలింది. జైశ్రీరాం నినాదాలతో కరీంనగర్​ పుర వీధులు మార్మోగాయి. యాత్రలో ప్రదర్శించిన వివిధ కళారూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. యాత్రకు ముఖ్యఅతిథిగా హాజరైన అస్సాం ముఖ్యమంత్రి హిమంత​ బిశ్వ శర్మ ప్రసంగం యాత్రకు హాజరైన వారిలో ఉత్సాహం నింపింది. అనంతరం బండి సంజయ్​ చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది.

హిందూ ఏక్తా యాత్ర లో పాల్గొనడానికి వచ్చిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భారీగా తరలివచ్చిన జన సందోహానికి అభివాదం చేశారు. అంతకు ముందు అస్సాం నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్​ చేరుకున్న హిమంత్​ బిశ్వశర్మ హెలికాప్టర్‌లో కరీంనగర్​ చేరుకున్నారు. కరీంనగర్​లో ఎంపీ బండి సంజయ్​తో పాటు పలువురు బీజేపీ నాయకులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రత్యేక ఆర్​ అండ్​ బి గెస్ట్​ హౌస్​ చేరుకున్న ఆయన భారీ బందోబస్తు మధ్య బండి సంజయ్​తో కలిసి వైశ్య భవన్​ వద్దకు చేరుకున్నారు. వైశ్య భవన్​ వద్ద బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంపై వారు యాత్రలో పాల్గొన్నారు. యాత్రకు హాజరైన వారితో కరీంనగర్​ పట్టణంలోని పురవీధులు కాషాయమయం కావడంతోపాటు జైశ్రీరాం నివాదాలతో మార్మోగింది.

ఆకట్టుకున్న ప్రదర్శనలు..

కరీంనగర్​లో నిర్వహించిన హిందూ ఏక్తా యాత్రలో భాగంగా పలువురు కళాకారుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా భారీ హనుమాన్​ విగ్రహం ప్రత్యేకంగా నిలిచింది. హనుమాన్​ విగ్రహం రెండు చేతుల్లో శివపార్వతుల కొలువుదీరినట్లు ఉండడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యాత్రలో కళాకారుల డప్పు చప్పుళ్లు, కాంతార నృత్యాలు ప్రత్యేకంగా నిలిచాయి. పెద్ద సంఖ్యలో హాజరైన హిందువులు కాషాయ జెండాలు పట్టుకొని యాత్ర ప్రారంభం నుంచి చివరి వరకు సాగారు.

భద్రత ఏర్పాట్లు పరిశీలించిన సీపీ

హిందూ ఏక్తా యాత్ర బందోబస్తు ఏర్పాట్లను కరీంనగర్ పోలీస్​ కమిషనర్​ సుబ్బారాయుడు పర్యవేక్షించారు. సందర్భంగా పట్టణంలో భారీగా పోలీసులు మోహరించారు. యాత్రలో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు సుబ్బరాయుడు సూచనలు చేశారు. అస్సాం ముఖ్యమంత్రికి జెడ్​ఫ్లస్​ క్యాటగిరి రక్షణ ఉండడంతో యాత్ర జరిగిన ప్రాంతాన్ని పోలీసులు ముందుగానే ఆధీనంలోకి తీసుకున్నారు.

ముందుకు వచ్చిన దాతలు..

హిందూ ఏక్తా యాత్ర‌లో పాల్గొన వారికి తాగునీటి సౌకర్యాన్ని స్థానిక వ్యాపారులు కల్పించారు. పలువురు వ్యాపారులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఉచితంగా మంచి నీటిని పంపిణీ చేశారు. యాత్ర జరుగుతున్న ప్రాంతాల్లో తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకున్నారు. అలాగే అక్కడక్కడ అల్పహారం ఏర్పాటు చేసి ఉచితంగా అందించారు.

Tags:    

Similar News