సొంత బిడ్డల్లా చూసుకుంటా

సిరిసిల్లలో శనివారం ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మిక దంపతుల ముగ్గురు పిల్లలను తన సొంత బిడ్డల్లా చూసుకుంటానని, వారు ఎంత వరకు చదువుకున్నా చదివించే పూర్తి బాధ్యత తానే తీసుకుంటానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ భరోసా ఇచ్చారు.

Update: 2024-11-10 15:31 GMT

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : సిరిసిల్లలో శనివారం ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మిక దంపతుల ముగ్గురు పిల్లలను తన సొంత బిడ్డల్లా చూసుకుంటానని, వారు ఎంత వరకు చదువుకున్నా చదివించే పూర్తి బాధ్యత తానే తీసుకుంటానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ భరోసా ఇచ్చారు. శనివారం సిరిసిల్ల పట్టణంలో ఆత్మహత్య చేసుకున్న అమర్-స్రవంతి దంపతుల కుటుంబాన్ని ఆయన ఆదివారం పరామర్శించారు. అమర్-స్రవంతి దంపతుల ముగ్గురి పిల్లల చదువు బాధ్యత తనదేనని, తలో రెండు లక్షల రూపాయలు ఫిక్స్డ్​ డిపాజిట్ కూడా చేస్తానని హామీ ఇచ్చారు.

    అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ పేరిట అనేక హామీలను ఇచ్చి బీసీలకు రంగుల కలను ప్రదర్శించిందని ఎద్దేవా చేశారు. నేతన్నలకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందానికంటే రెట్టింపు చేస్తామని, ఊదరగొట్టు హామీలు ఇచ్చిందని మండిపడ్డారు. గత సంవత్సరం నుండి ఉపాధి లేక సోలాపూర్ నుండి వలస వచ్చిన జంట శనివారం ఆత్మహత్య చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. 11 నెలల్లో సిరిసిల్లలో 20 మంది, రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో 14 మంది ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం పొడిచిన వెన్నుపోటు వలన సిరిసిల్లలో ఆత్మహత్యల పరంపర కొనసాగుతుందని విమర్శించారు.

    రాష్ట్రంలో ఇప్పటికే 34 మంది నేత కార్మికుల ఆత్మహత్య చేసుకున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గు ఉంటే ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉండడం వల్లనే ఇక్కడి ప్రజలపై ముఖ్యమంత్రికి ప్రేమ కలగడం లేదంటే, ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. కానీ మంచిగా నడుస్తున్న వస్త్ర వ్యాపార రంగాన్ని, చంపేసే విధంగా ఓ శాడిస్టులా వ్యవహరించడం మంచిది కాదని సూచించారు.

    సిరిసిల్ల ప్రాంతానికి న్యాయం చేసే వరకు వదిలిపెట్టమని, అవసరమైతే ప్రత్యక్ష పోరాటానికి కూడా వెనకాడబోమని హెచ్చరించారు. అనంతరం పట్టణంలో గతంలో చనిపోయిన నేత కార్మికుల కుటుంబాలను పరామర్శించారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్సీ ఎల్.రమణ, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 


Similar News