దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన ప్రభుత్వ విప్..
చందుర్తి మండలంలోని దేవుని తండా పరిధిలో అకాల వర్షం వల్ల దెబ్బతిన్న పంట పొలాలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పరిశీలించారు.

దిశ, చందుర్తి : చందుర్తి మండలంలోని దేవుని తండా పరిధిలో అకాల వర్షం వల్ల దెబ్బతిన్న పంట పొలాలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కొన్ని ప్రాంతాల్లో 30%, కొన్ని ప్రాంతాల్లో 50% పంట నష్టం వాటిల్లిందన్నారు. రాళ్ల వర్షానికి పంట నష్టం జరిగిందని తెలియగానే జిల్లా కలెక్టర్ తో మాట్లాడి సంబంధిత అధికారులకు సమాచారం తెలియజేశామన్నారు. కోతకు వచ్చిన పంట పొలాలు నష్టపోవడం బాధాకరం, ప్రభుత్వ పక్షాన రైతాంగాన్ని ఆదుకుంటామన్నారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు పదివేల సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు.
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామన్నారు. జిల్లా పరిధిలో ఉన్న వ్యవసాయ అధికారులను ప్రతి మండలంలో నష్టపోయిన పంటల నివేదిక తయారు చేయాలన్నారు. రెండు రోజుల్లో గ్రామాల్లో సమగ్ర విచారణ జరిపించి రిపోర్టు ప్రభుత్వానికి అందజేయాలని, నష్టపోయిన రైతుల పూర్తి వివరాలు ప్రభుత్వానికి అందిస్తే ఎకరానికి 10,000 ఆర్థిక సహాయం అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంట బీమా సౌకర్యాన్ని కల్పించడానికి కృషి చేస్తున్నారన్నారు.