అభ్యంతరాలు, సూచనల మేరకే కులాల పేరు మార్పు..

బీసీలలోని కొన్ని కులాల నుండి వస్తున్న అభ్యంతరాలు సూచనలు మేరకే కులాల పేరు మార్పు ఉంటుందని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ అన్నారు.

Update: 2025-03-27 16:36 GMT

దిశ, కొండగట్టు, జగిత్యాల టౌన్ : బీసీలలోని కొన్ని కులాల నుండి వస్తున్న అభ్యంతరాలు సూచనలు మేరకే కులాల పేరు మార్పు ఉంటుందని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ అన్నారు. బీసీలలో ఉన్న కొన్ని కులాల స్థితిగతులను తెలుసుకునే క్రమంలో బీసీ కమిషన్ సభ్యులు గురువారం జగిత్యాల జిల్లాలో పర్యటించారు. మొదట కొండగట్టుకు చేరుకున్న బీసీ కమిషనర్ చైర్మన్ నిరంజన్ తో పాటు సభ్యులు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అధికారులు ఘన స్వాగతం పలికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం అక్కడ నుండి జగిత్యాల మున్సిపల్ పరిధిలోని టీఆర్ నగర్ లో తర్వాత పట్టణంలోని గాంధీ నగర్ లో కుల సంఘాల వారితో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా వారి నుండి వచ్చిన అభ్యర్థనలు సూచనలను ఈ నెల 29 తర్వాత ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. అనంతరం మెడికల్ కాలేజ్ గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ బీసీలలో కొన్ని కులాల పేర్లు చెప్పుకోవడానికి ఇబ్బంది పడే విధంగా ఉన్నాయని వాటికి పర్యాయపదాలుగా మరో పేరు పెట్టే విధంగా చర్యలు చేపడతామన్నారు. ఈ సందర్భంగా బీసీ కమిషన్ సభ్యులకు బీసీ సంఘాల నాయకులు వినతి పత్రాలు అందజేశారు. తర్వాత ధర్మపురిలో పర్యటించిన బీసీ కమిషన్ సభ్యులు వివిధ బీసీ కులాల స్థితిగతులను అధ్యయనం చేశారు. ఈ కార్యక్రమంలో, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, రంగు బాల లక్ష్మి, బీసీ సంక్షేమ జిల్లా అధికారి కల్పన, తదితరులు పాల్గొన్నారు.

Similar News