గణేష్ నిమజ్జన వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

వేములవాడ పట్టణంలో గణేష్ నిమజ్జన వేడుకలు ప్రశాంతం

Update: 2024-09-16 16:04 GMT

దిశ, వేములవాడ : వేములవాడ పట్టణంలో గణేష్ నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా ముగిసాయి. గత తొమ్మిది రోజులుగా విశేష పూజలు అందుకున్న గణనాథులు సోమవారం మధ్యాహ్నం మండపాలు నుండి కదిలి, భారీ శోభయాత్రగా తరలివచ్చాయి. అనంతరం గుడి చెరువు వద్ద ఏర్పాటు చేసిన నిమజ్జన ప్రాంతంలో భారీ క్రేన్ల సాయంతో గణేషులను నిమజ్జనం చేశారు.

ఇదిలా ఉండగా పట్టణంలో జరిగిన నిమజ్జన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్ లతో కలిసి నిమజ్జన తీరును పరిశీలించారు. అనంతరం ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ 9 రోజులపాటు ఎంతో భక్తి శ్రద్ధలతో గణనాథుని పూజించి గంగమ్మ ఒడికి మహిళల కోలాటాలతో, యువకుల నృత్యాలతో సాగానంపడం చాలా సంతోషకరమని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ లేని విధంగా భారతదేశంలో గణనాథుడి పూజించడం హైందవ సంస్కృతి కాపాడడంలో భారతీయుల ముందంజలో ఉంటారన్నారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటుచేసుకోకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు, మున్సిపల్ పాలకవర్గం, సిబ్బంది కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి-రాజు, వైస్ చైర్మన్ బింగి మహేష్, కౌన్సిలర్లు, వేములవాడ ఏ.ఎస్పి శేషాద్రిని రెడ్డి, డి.ఎం.హెచ్.ఓ వసంత రావు, ఆర్డీవో రాజేశ్వర్, తహసీల్దార్ మహేష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ సంపత్ రెడ్డి, పలు శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన మున్సిపల్ అధికారులు..

పట్టణంలో జరిగిన నిమజ్జన వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ ఆధ్వర్యంలో పోలీసు యంత్రాంగం పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయగా, మున్సిపల్ ఆధ్వర్యంలో నిమజ్జన వేదిక వద్ద పటిష్ట చర్యలు చేపట్టారు. నిమజ్జన వేడుకలు తిలకించేందుకు వచ్చే పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కమిషనర్ సంపత్ రెడ్డి ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. జిల్లా మత్స్య శాఖ ఆధ్వర్యంలో గజ ఈతగాళ్లను, లైఫ్ జాకెట్లను ఏర్పాటు చేయగా, అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ ను ఏర్పాటు చేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వసంత రావు ఆధ్వర్యంలో వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు.


Similar News