సీఎం అభ్యర్థిగా ఈటల? వాట్సప్‌లో హల్‌చల్
దిశ ప్రతినిధి, కరీంనగర్: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి అభ్యర్థి కాబోతున్నారా..? ఇందుకు అధిష్టానం క్లియరెన్స్ ఇచ్చిందా...?
దిశ ప్రతినిధి, కరీంనగర్: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి అభ్యర్థి కాబోతున్నారా..? ఇందుకు అధిష్టానం క్లియరెన్స్ ఇచ్చిందా...? ఆయనే ఇందుకు అవసరమైన స్కెచ్ వేశారా? లేక అభిమానుల అత్యుత్సాహామో తెలియదు కానీ... సోషల్ మీడియా కేంద్రంగా సాగుతున్న ప్రచారం మాత్రం విస్తృతంగా పెరిగింది. తాజాగా ''ఈటల రాజేందర్ సీఎం'' పేరిట వాట్సప్ గ్రూపులు క్రియేట్ చేయడం సంచలనం కలిగిస్తోంది.
సోషల్ మీడియాపై...
మాజీ మంత్రి ఈటల రాజేందర్ సోషల్ మీడియా కేంద్రంగా ప్రచారం చేసుకోవడంపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. ప్రత్యేకంగా యూట్యూబ్ ఛానెళ్లు, ఫేస్ బుక్ అకౌంట్లు, వాట్సప్ తో పాటు ఇతరత్రా సోషల్ మీడియాకు సంబంధించిన వేదికలే ప్రచారం చేసేందుకు ప్రత్యేకంగా ఓ టీం ఉంటుంది. మంత్రివర్గం నుండి బహిష్కరణకు గురైన తరువాత కూడా చకాచకా వాట్సప్ గ్రూపులు క్రియేట్ అయ్యాయి. వేల సంఖ్యలో ఏర్పాటయిన వాట్సప్ గ్రూపుల్లో ఆయనకు అనుకూలమైన పోస్టుల పరంపరం కొనసాగింది. ఆ తరువాత ఆయన ఎమ్మెల్యేగా కూడా రాజీనామా చేయడం ఉప ఎన్నికలు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈటల ఓటమి కోసం సర్వశక్తులు ఒడ్డినా రాజేందర్ గెలుపును శాసించలేకపోయింది. ఎన్నికల్లో గెలిచిన తరువాత కూడా ఈటల సోషల్ మీడియా కేంద్రంగా జరిగిన ప్రచారమే తనను గెలిపించిందని వ్యాఖ్యానించిన సందర్భాలు కూడా లేకపోలేదు. ఇప్పుడు కూడా ఈటల రాజేందర్ సీఎం పేరిట వాట్సప్ గ్రూపులు క్రియేట్ కావడంతో ముందస్తుగానే కార్యకలాపాలకు శ్రీకారం చుట్టారా? అన్న చర్చ సాగుతోంది. వీటిని ఆయన అనుచరులో లేక అభిమానులో స్టార్ట్ చేసి ఉంటారన్న వాదనలు వినిపిస్తున్నప్పటికీ రాజేందర్ నుండి సానుకూల సంకేతాలు వచ్చే ఉంటాయని అంటున్న వారూ లేకపోలేదు.
అధిష్టానం ఓకేనా...?
అయితే వైవిద్యమైన నిర్ణయాలతో ముందుకు సాగే బీజేపీ అధినాయకత్వం సీఎం అభ్యర్థిగా ప్రచారం చేసుకోవాలని బీజేపీ అధిష్టానం క్లియరెన్స్ ఇచ్చిందా? అన్న చర్చ కూడా సాగుతోంది. జాతీయ నాయకత్వం అనుమతి ఇచ్చినట్టయితే ఇప్పటికే బహిరంగంగానే ప్రకటించేది కదా అని పార్టీ వర్గాలు అంటుంటే రహస్యంగా జాతీయ నాయకత్వం మాట ఇచ్చి ఉంటుందని అంటున్నారు మరికొందరు. అయితే బీజేపీ అధినాయకత్వం మాత్రం ముందుగానే సీఎం అభ్యర్థిని ప్రకటించే అవకాశాలు ఉండవని, రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడం, సానుకూలతను సాధించడం వంటి విషయాలపైనే దృష్టి సారిస్తుంది తప్ప అప్పుడే సీఎం అభ్యర్థి ఎవరూ అనే విషయాన్ని ప్రకటించే అవకాశాలు ముమ్మాటికీ లేదని పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు. ఈటల సీఎం పేరిట వాట్సప్ గ్రూపులు మాత్రం క్రియేట్ కావడం మాత్రం ఆయన వ్యక్తిగత విషయమని, జాతీయ, రాష్ట్ర నాయకత్వానికి ఎలాంటి సంబంధం లేదని వ్యాఖ్యానించారు ఓ నాయకుడు.
దూకుడేనా..?
బీజేపీ సిద్దాంతం చాలా డిఫరెంట్ గా ఉంటుందన్నది బహిరంగ రహస్యం. నిర్ణయాలు కూడా ఎవరికీ అంతు చిక్కకుండా ఉంటాయన్నది నిజం. కీలక బాధ్యతల్లో ఎవరిని కూర్చోబెట్టాలోనన్న విషయంలో చివరి క్షణం వరకూ బయటకు పొక్కనీయకుండా ఉంచడం పార్టీ నైజం. అలాంటిది ఈటల విషయంలో మాత్రం ముందస్తుగానే జాతీయ నాయకత్వం స్పష్టమైన సంకేతాలు ఇస్తుందా? అన్నదే అంతుచిక్కకుండా పోయింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని నియామకం విషయంలో ఆచితూచి వ్యవహరించిన సంగతి అందరికీ తెలిసిందే. చాలామంది నేతల పేర్లు జాతీయ నాయకత్వం పరిశీలనకు వెళ్లినప్పటికీ.. పార్టీతోనే అనుబంధం పెట్టుకున్న బండి సంజయ్ వైపే మొగ్గు చూపింది. పార్టీతో మమేకమైన వారికి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ఇతర నాయకుల మెరిట్స్, డీ మెరిట్స్ ను కూడా బేరీజు వేసుకున్న తరువాతే బండి సంజయ్ పేరును ఖాయం చేసిన సంగతి తెలిసిందే. పార్టీ బాధ్యతలను అప్పగించే విషయంలోనే ఎన్నో రకాలుగా ఆలోచించిన జాతీయ నాయకత్వం... సీఎం అభ్యర్థి విషయంలో ఠక్కున నిర్ణయం ఎలా తీసుకుంటుందని ప్రశ్నిస్తున్న వారూ లేకపోలేదు. స్థానికంగా ఎవరూ ఎలాంటి ప్రచారం చేసుకున్నా జాతీయ నాయకత్వం నిర్ణయమే ఫైనల్ అని అంటున్నారు. ముందుగా రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసి, అధికార పార్టీని మట్టికరిపించేందుకు కసరత్తులు చేయాల్సిన సమయంలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు..? అన్న విషయం గురించే చర్చే అవసరం లేదని బీజేపీ వర్గాలు అంటున్నాయి. దీంతో ఈటల సీఎం అన్న విషయంపై మాత్రం ఎలాంటి క్లారిటీ మాత్రం లేదని స్పష్టం అవుతున్నప్పటికీ వాట్సప్ గ్రూపులు క్రియేట్ కావడం వెనక ఆంతర్యం ఏంటీ అన్నది మాత్రం పజిల్ గానే మారిపోయింది.