సింగరేణిలో ఎన్నికల సందడి షురూ

తెలంగాణ కొంగు బంగారంగా భావించే సింగరేణి సంస్థలో ఎన్నికల సందడి మొదలైంది. మూడేళ్ల నిరీక్షణ తర్వాత గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు మోక్షం కలిగింది.

Update: 2023-03-15 02:26 GMT

దిశ, పెద్దపల్లి : తెలంగాణ కొంగు బంగారంగా భావించే సింగరేణి సంస్థలో ఎన్నికల సందడి మొదలైంది. మూడేళ్ల నిరీక్షణ తర్వాత గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు మోక్షం కలిగింది. గుర్తింపు కార్మిక సంఘం పదవీకాలం పూర్తి కావడంతో కార్మికుల సమస్యలు, సౌకర్యాలపై యాజమాన్యంతో చర్చించే పరిస్థితి లేకుండా పోయింది. అయితే పదవీకాలం ముగిసినప్పటికీ బీఆర్​ఎస్​ అనుబంధ సంస్థ అయిన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నేతలు గుర్తింపు సంఘం నాయకులుగానే చలామణి అయ్యారనే విమర్శలు ఉన్నాయి. గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్​పార్టీ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్​టీయూసీ ఇటీవల కోర్టును ఆశ్రయించారు.

ప్రాంతీయ లేబర్​కమిషనర్​ కార్యాలయం, కేంద్ర కార్మిక శాఖ ఉప కమిషనర్​ ఈనెల 13న సమావేశం నిర్వహించి ఏప్రిల్​2న సింగరేణి ఎన్నికల షెడ్యూల్​విడుదల చేస్తామని ప్రకటించడంతో సింగరేణి వ్యాప్తంగా ఎన్నికల సందడి షురూ అయింది.​అనేక మలుపులు తిరిగిన సింగరేణి సంస్థలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు ముందడుగు పడింది. సంస్థ ప్రస్తుతం తెలంగాణలో పెద్దపల్లి, మంచిర్యాల, కొమురం భీం, ఖమ్మం, ఆసిఫాబాద్, జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలతో పాటు భదాద్రి కొత్తగూడెం జిల్లాలో విస్తరించి ఉన్నది. సింగరేణి సంస్థకు మొత్తం 11డివిజన్లు ఉండగా 2017 లో చివ‌రిసారి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో బీటీఆర్ఎస్ అనుబంధ సంఘ‌మైన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం జయకేతనం ఎగరేసి గుర్తింపు సంఘంగా ఆవిర్భవించింది.

రెండేళ్ల పదవీ కాలం..

సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఎన్నికైన సంఘం పదవి కాలం రెండేళ్ల పాటు ఉంటుంది. ఎన్నికల సంఘం ప్రతినిధులను కార్మికులకు సంబంధించిన సమస్యలపై, సంక్షేమం కోసం తీసుకునే నిర్ణయాల సమావేశానికి ఆహ్వానిస్తుంది. 2017 ఎన్నికల సమయంలో కాల పరిమితి నాలుగేళ్లు ఉంటుందని ప్రకటించినప్పటికీ ఎన్నికైన తరువాత అందించే గెలుపు పత్రంలో మాత్రం రెండేళ్ల కాల పరిమితిగానే పేర్కొన్నారు. నిర్ణీత షెడ్యూల్​ ప్రకారం గడువు 2019 సెప్టెంబర్ లో ముగిసిపోయింది. రెండేళ్లు, నాలుగేళ్ల వివాదంపై గుర్తింపు కార్మిక సంఘం నాయకులు కోర్టును ఆశ్రయించారు.

సింగరేణి ఎన్నికల నిర్వహణపై సింగరేణి యాజమాన్యం ఆసక్తి చూపకపోవడంతో ఎన్నికల ఆలస్యానికి సైతం ఒక కారణంగా చెప్తున్నారు. జాతీయ కార్మిక సంఘాలు సైతం పార్టీలకు అతీతంగా జేఏసీగా ఏర్పడి ఎన్నికలు నిర్వహించాలని ఆందోళనలు చేపట్టాయి. పదవీ కాలంపై సైతం ఎన్నికల నిర్వహణకు ముందు స్పష్టత ఇవ్వాలని సంఘాల నాయకులు పట్టుపట్టారు. కేంద్ర కార్మిక శాఖ ఉప కమిషనర్​ రెండేళ్ల పదవీ కాలం ఉంటుందని స్పష్టత ఇచ్చారు.

అమలు కాని ఆదేశాలు..

సింగరేణి సంస్థలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలని జాతీయ సంఘాల ఆందోళనతో సింగరేణిలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రాంతీయ కార్మిక కమిషనర్ (ఆర్‌ఎల్‌సి) సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని సింగరేణి ఆర్‌ఎల్‌సికి తెలిపింది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఉత్తర్వుల కోసం సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాసింది. ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవడంతో కార్మిక సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. దీంతోయ కోర్టు మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో పాటు దీంతో కేంద్ర కార్మిక శాఖ కూడా సింగరేణి సంస్థను ఆదేశించగా, ఎట్టకేలకు యాజమాన్యం దిగొచ్చింది. ఎన్నికల నిర్వహణకు సమాయత్తం అయ్యింది.

ఏప్రిల్ 2న షెడ్యూల్​ విడుదల సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల షెడ్యూల్​ విడుదల చేస్తామని ప్రాంతీయ లేబర్​ కమిషనర్​తో పాటు కేంద్ర కార్మిక శాఖ ఉప కమిషనర్​ ప్రకటన చేశారు. సింగరేణి విస్తరించిన మంచిర్యాల, కొమురం భీం, పెద్దపల్లి, ఖమ్మం, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో రాజకీయ పరిస్థితులను సింగరేణి ఎన్నికలు ప్రభావితం చేస్తాయి. ఇక్కడ యూనియన్ ఎన్నికలు జరిగితే ఇక్కడ వచ్చే ఫలితాలు రాబోయే ఎన్నికల పై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. రాష్ర్ట శాసనసభకు షెడ్యూల్​ ప్రకారం ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో అన్ని రాజకీయ పార్టీలకు సింగరేణి ఎన్నికలు సెమీఫైనల్​గా మారే అవకాశం కనిపిస్తోంది

Tags:    

Similar News