ఎగ్‌ వెరీ స్మాల్‌ గురూ..! పక్షి గుడ్ల సైజులో అంగన్‌వాడీ గుడ్లు

అంగన్ వాడీల్లో పౌష్టికాహారం అందని ద్రాక్షలాగే మారుతోంది.

Update: 2024-09-28 02:08 GMT

దిశ, జగిత్యాల ప్రతినిధి : అంగన్ వాడీల్లో పౌష్టికాహారం అందని ద్రాక్షలాగే మారుతోంది. ఏదో ఒక కొర్రీ చూపెట్టి నాణ్యత లేని ఆహారం అందిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. బలహీనతను పోగొట్టే కోడిగడ్ల సరఫరాలో సైతం అవినీతి జరుగుతుండడం అంగన్ వాడీల పనితీరుకు అద్ధం పడుతుంది. ఉన్నతాధికారు పర్యవేక్షణ లేక తక్కువ పరిమాణం కలిగిన గుడ్లు సరఫరా చేస్తూ కాంట్రాక్టర్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. జిల్లాలో ఐసీడీఎస్ ద్వారా అంగన్‌వాడీలకు సరఫరా చేసే కోడిగుడ్లు చిన్నబోతున్నాయి. కోడిగుడ్ల సరఫరాలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సంబంధిత శాఖలో కీలకంగా వ్యవహరించే కొంతమంది ఆఫీసర్ల అండదండలతోనే కాంట్రాక్టర్లు నాణ్యతలేని చిన్న సైజు కోడిగుడ్లను సరఫరా చేస్తున్నట్లుగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంగన్‌వాడీల ద్వారా పంపిణీ చేసే కోడిగుడ్లు వాస్తవానికి ఒక్కోటి 45గ్రాముల నుండి 50 గ్రాముల బరువు ఉండాలి. మొతంగా ఒక ట్రే లో ఉండాల్సిన 30కోడిగుడ్లు 1350గ్రాముల నుండి కిలోన్నర బరువు ఉండాల్సి ఉంటుంది. కానీ సగటున ఒక్కో గుడ్డు 40గ్రాములు ఉండగా ట్రే బరువు 1200గ్రాములు దాటడం లేదని తెలుస్తుంది. నాణ్యతలేని తక్కువ బరువు ఉన్న గుడ్లను పంపిణీ చేయడం ద్వారా కావాల్సిన స్థాయిలో పోషకాలు గర్భిణీలకు,బాలింతలకు, చిన్నారులకు అందడం లేదు.

నాసిరకమైన చిన్న సైజ్ గుడ్ల సరఫరా

అంగన్‌వాడీలకు కోడిగుడ్లను సరఫరా చేసే ఏజెన్సీల కాంట్రాక్టర్లు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. టెండర్ నిబంధనలు తుంగలో తొక్కి చిన్న సైజులో ఉన్న కోడిగుడ్లను అంగన్వాడీలకు సరఫరా చేస్తూ బిల్లులు మాత్రం కరెక్ట్ గా క్లెయిమ్ చేసుకుంటున్నారు. కొడిమ్యాల మండలంలోని ఓ అంగన్వాడీలో ఒక్కో కోడిగుడ్డు 38 గ్రాముల నుండి 40 గ్రాముల లోపే ఉండటం పరిస్థితికి అద్దం పడుతుంది. అయితే ట్రే లోని ఏ ఒకటో రెండో అలా తక్కువ బరువు ఉన్నాయటంటే వేరు... మొత్తం గుడ్లు అన్ని తక్కువ బరువులో ఉన్నాయి. దీంతో మొత్తం ట్రే గుడ్ల బరువు 1200 గ్రాములకు మించి రావడం లేదు. కానీ రికార్డుల్లో మాత్రం అంతా సవ్యంగా ఉన్నట్లు చూపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇదేంటని అంగన్‌వాడీ టీచర్లను ప్రశ్నిస్తే వచ్చిన గుడ్లని సరఫరా చేస్తున్నామని తలలు పట్టుకుంటున్నారు. మీటింగ్ పెట్టినప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా సూచించడం తప్ప తామేమీ చేయలేమని చెబుతున్నారు. ఇదిలా ఉండగా కొద్ది రోజుల క్రితం కోరుట్లలో సరఫరా చేసిన కోడిగుడ్లు పూర్తిగా కుళ్ళి పోయి ఉండటం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.

స్టాంపింగ్ చేసినా ఆగని అక్రమాలు.

అంగన్‌వాడీ ద్వారా సరఫరా చేసే కోడుగుడ్లు పక్కదారి పట్టకుండా ఉండేందుకు కోడిగుడ్లపై స్టాంపింగ్ చేస్తూ సరఫరా చేస్తున్నారు . మొదటి 15 రోజులకు గాను పీకాక్ గ్రీన్ కలర్ ఆ తర్వాత 15 రోజులు పింక్ కలర్ స్టాంపింగ్ వేసిన గుడ్లను పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం ద్వారా కోడిగుడ్లు ఎక్కువ కాలం నిలువ ఉంచకుండా జాగ్రత్తపడటం తో పాటు గర్భిణీలకు పిల్లలకు,బాలింతలకు నాణ్యమైన తాజా గుడ్లు అందించే అవకాశం ఉంది. కానీ కొన్ని జిల్లాలో చాలా అంగన్వాడి సెంటర్లలో టీచర్లు నెలకు 26 రోజులకు మాత్రమే కోడిగుడ్లను పంపిణీ చేస్తున్నారు. మిగిలిన వాటిని పక్కదారి పట్టిస్తున్నారు. ఈ క్రమంలో గుడ్లను తీసుకొని వారివి రికార్డులో తీసుకున్నట్లు నమోదు చేసి ఒకే రకమైన స్టాంపింగ్ వేసిన గుడ్లను నెలరోజుల పాటు పంపిణీ చేస్తున్నట్లు విమర్శలు. తీసుకెళ్లని వారికి తాలూకు తాజా కోడిగుడ్లను కొందరు టీచర్లు అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

లక్ష్యానికి దూరంగా అంగన్‌వాడీలు.

శిశు, ప్రసూతి మరణాలు తగ్గించడంలో బలవర్ధకమైన పోషకాహారం అందజేయడం అత్యంత ముఖ్యమైనది. అందులో భాగంగానే ప్రభుత్వం బాలింతలు, గర్భిణీలు, చిన్నారులకు అంగన్వాడీల ద్వారా పోషకాహారం అందిస్తూ వస్తుంది. అయితే ఏ లక్ష్యంతో ప్రభుత్వం అంగన్‌వాడీలను ఏర్పాటు చేసిందో అది పూర్తిస్థాయిలో నెరవేరడం లేదు. అంగన్‌వాడీల ద్వారా అందిస్తున్న పోషకాహర పదార్థాల్లో నాణ్యత లోపం ఉన్నట్లుగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా 1065 అంగన్వాడి కేంద్రాలు ఉండగా వాటి ద్వారా నిత్యం చిన్నారులు,బాలింతలు, గర్భిణీలకు పాలు, గుడ్లు, అన్నం పప్పులు వంటి పౌష్టికాహారాన్ని అందజేస్తున్నారు. చిన్న సైజులో వస్తున్న కోడిగుడ్లు, నాసిరకంగా ఉన్న పదార్థాల కారణంగా చాలా వరకు గర్భిణీలు, బాలింతలు అంగన్వాడీలకు రావడం లేదనే విమర్శలు లేకపోలేదు.

గుడ్డు సైజు, నాణ్యతలో కఠినంగా వ్యవహరిస్తున్నాం: జిల్లా సంక్షేమ అధికారి నరేష్

అంగన్‌వాడీలకు పంపిణీ చేసే కోడిగుడ్లు బరువు 42 నుండి 50 గ్రాముల మధ్యలో ఉండాలి. ఒక్కో గుడ్డు కాకుండా మొత్తం ట్రే వెయిట్ చేస్తాం. అలా చేసినప్పుడు 30 కోడిగుడ్లు ఉన్న ట్రే 1350 గ్రాముల పైన బరువు ఉండాలి. చిన్న సైజులో ఉన్న గుడ్లను సరఫరా చేస్తే చర్యలు తీసుకుంటాం. ఇటీవల అలా చిన్న సైజులో వచ్చిన కోడిగుడ్లను వెనక్కి పంపించాము.


Similar News