పోలీసుల పేరుతో వ్యాపారులకు సైబర్ వల..
మన ఇద్దరికీ తెలిసిన లేదా మనకు దగ్గరి వ్యక్తులకు తెలిసినవాడుగా ఫోన్ లో మాట్లాడుతూనే పరిచయం చేసుకుని, మాయ చేసి నిమిషాల వ్యవధిలోనే ఇద్దరిలో ఒకరి వద్ద నుంచి డబ్బులు కొట్టేసే సైబర్ ముఠా అరాచకాలు ఈ మధ్యన మితిమీరుతున్నాయి.
దిశ, వెల్గటూర్ : మన ఇద్దరికీ తెలిసిన లేదా మనకు దగ్గరి వ్యక్తులకు తెలిసినవాడుగా ఫోన్ లో మాట్లాడుతూనే పరిచయం చేసుకుని, మాయ చేసి నిమిషాల వ్యవధిలోనే ఇద్దరిలో ఒకరి వద్ద నుంచి డబ్బులు కొట్టేసే సైబర్ ముఠా అరాచకాలు ఈ మధ్యన మితిమీరుతున్నాయి. గత రెండు నెలల క్రితం జగిత్యాల జిల్లా రాజారాం పల్లిలోని ఓ వ్యాపారి నుంచి రూ .75 వేలు ఫోన్ పే ద్వారా తన ఖాతాకు కొట్టించుకున్న సైబర్ నేరగాళ్ల ఉదంతం ప్రజల మదిలో నుంచి ఇంకా చెరిగి పోక ముందే మరో సంఘటన సోమవారం వెల్గటూర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఈ సారి సైబర్ నేరగాళ్ల వలలో పడి ఓ వ్యాపారి ఏకంగా రూ.90 వేలు కోల్పోవటం విశేషం. సైబర్ మాయగాళ్ళు ఎప్పుడు ఏ రూపంలో వచ్చి వలవేస్తారో అంతు చిక్కకుండా ఉందని బాధితుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ఈ సైబర్ మోసం వివరాలు ఇలా ఉన్నాయి. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలో సైబర్ మోసగాళ్ల వలలో పడి బండారి తిరుపతి అనే ఫెర్టిలైజర్ వ్యాపారి రూ. 90వేలు మోస పోయాడు. ఇతడి షాప్ కు ఎదురుగానే హరీష్ అనే యువకుడు మరో షాప్ నిర్వహిస్తున్నారు. ఇతనికి సోమవారం ఉదయం పోలీసుల పేరుతో ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఏఎస్సై కూతురుకు ఆరోగ్యం బాగాలేదు ఫోన్ పే క్యాష్ తక్షణమే కావాలని ఓ కాల్ వచ్చింది. హరీష్ కు కాల్ చేసింది ఎవరు ఏమి అని అతడు పూర్తిగా తెలుసుకోకుండానే పోలీసులని చెప్పగానే నమ్మేశాడు. ఆ తర్వాత ఇదే విషయమై అతని ఎదురుగా ఉండే బండారి తిరుపతి అనే ఫెర్టిలైజర్ వ్యాపారికి ఫోన్ చేసి డిజిటల్ క్యాష్ లక్ష రూపాయలు పోలీసులకు కావాలని అడిగాడు. వెంటనే లిక్విడ్ కాష్ ఇచ్చేస్తారని హరీష్ చెప్పాడు.
తిరుపతికి అంతకు ముందు రోజే ఒకరు లిక్విడ్ క్యాష్ కావాలని చెప్పి ఉండడంతో ఆయన నమ్మి సరే అన్నాడు. ఆ వెంటనే తన స్వగ్రామానికి చెందిన కుమ్మరి వెంకటేష్ కు ఫోన్ చేసి డిజిటల్ మనీ లక్ష రూపాయలు వరకు తెప్పించుకున్నారు. అదేసమయంలో హరీష్ కు ఫోన్ చేసిన సైబర్ నెరగాడు అతని వద్ద నుంచి తిరుపతి నంబరు తీసుకొని తిరుపతికి ఫోన్ చేసి మాట్లాడారు. ఇతనికి నమ్మకం కుదరక తిరిగి హరీష్ కి ఫోన్ చేసి నీవు చెప్పిన వ్యక్తి డబ్బులు పంపించమని కోరుతున్నాడు, పంపించాలా వద్దా అని అడిగారు. దానికి హరీష్ పంపించమని చెప్పడంతో అతను సైబర్ నేరగాడు పంపించిన స్కానర్ కు ఫోన్ పే ద్వారా రూ. 90 వేలు పంపించారు. ఫోన్ పే ద్వారా మనీ సెండ్ చేసిన ఐదు నిమిషాలకు ఇతడు లిక్విడ్ క్యాష్ రాలేదని హరీష్ కు పోన్ చేశాడు. పోలీసులు వెంటనే ఇస్తా అన్నారు. కదా ఇంకా ఇవ్వలేదా అని ఇద్దరు కలిసి సైబర్ నేరగాని ఫోన్ కు ఫోన్ చేయగా అది స్విచ్ ఆఫ్ వచ్చింది. పోలీసులు ఏఎస్ఐ అని చెప్పగానే నమ్మాను అసలు ఫోన్ చేసింది ఎవరో నాకు కూడా తెలియదని వెంటనే క్యాష్ ఇస్తామని చెప్పడంతో నమ్మానని హరీష్ చేతులెత్తాడు. దీంతో సైబర్ నేరగాళ్ళ వలలో పడి మోసపోయామని వారు తెలుసుకొని బాధితులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. వివరాలను సేకరించిన పోలీసులు వెంటనే సైబర్ పోలీసులకు సమాచారం ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ప్రజలు బ్యాంకు ఖాతాలను మనీ ఆన్లైన్ ట్రాంజాక్షన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు పదే పదె హెచ్చరిస్తున్నా, అవగాహన సదస్సులు పెడుతున్న, సైబర్ నేరగాళ్లు సరి కొత్త రూపాల్లో ప్రజల పై వల విసురుతూ దోపిడీ చేస్తూనే ఉన్నారు. మనతో లైవ్ లో మాట్లాడుతునే మన చేతనే మన ఫోన్ నుంచి డబ్బులు వారి ఖాతాలకు కొట్టించుకునే నైపుణ్యాన్ని అలవర్చుకొని సైబర్ నేరగాళ్లు వస్తున్నారని, ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని తెలియని వ్యక్తులు ఫోన్ కాల్స్ చేస్తే స్పందించవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.