కేఎఫ్ బీర్లు కావాలి.. ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం
సీఎం కేసీఆర్ సార్.. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కింగ్‌ఫిషర్ బీర్ సరఫరా నిలిచిపోయింది. జిల్లా ప్రజలు కేఎఫ్ బీరు కోసం ఇతర జిల్లాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
‘సీఎం కేసీఆర్ సార్.. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కింగ్‌ఫిషర్ బీర్ సరఫరా నిలిచిపోయింది. జిల్లా ప్రజలు కేఎఫ్ బీరు కోసం ఇతర జిల్లాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. దయచేసి ఈ బ్రాండ్ బీర్ జిల్లాలో అందుబాటులో ఉండేలా చూసుకోండి’ అంటూ జగిత్యాల జిల్లా రాయికల్ కు చెందిన ఓ యువకుడు గతంలో ఏకంగా సీఎం కేసీఆర్ ను అభ్యర్థించడం అప్పట్లో సంచలనంగా మారింది. 2019 స్థానిక సంస్థల ఎన్నికల్లో తాను ఓటు వేసిన పోస్టల్ బ్యాలెట్ తో పాటు కేఎఫ్ బీర్లు అమ్మకాలు చేపట్టాలని చీటీ రాసి బాక్స్ లో వేశాడు. ఓట్లు లెక్కించే క్రమంలో ఆ చీటీ చూసి అవాక్కవ్వడం అధికారుల వంతైంది. అంతకుముందు 2018లో కూడా జగిత్యాలకు చెందిన వ్యక్తి ప్రజావాణిలో కేఎఫ్ బీర్లు అమ్మడం లేదని ఫిర్యాదు చేయగా, తాజాగా 10 రోజుల క్రితం మరో యువకుడు కేఎఫ్ అమ్మకాలు చేపట్టాలని కోరుతూ ప్రజావాణిలో కలెక్టర్ విన్నవించాడు.
దిశ, జగిత్యాల ప్రతినిధి: జిల్లాలో సిండికేట్ మాయాజాలం కొనసాగుతున్నది. మద్యం వ్యాపారులు నూతన లిక్కర్ స్కాంనకు తెరలేపారు. మద్యం దుకాణాల కోసం లైసెన్స్ దక్కించుకునేందుకు గ్రూపుగా ఏర్పడిన కొంతమంది మద్యం వ్యాపారులు అధికంగా టెండర్లు వేసినట్లు సమాచారం. కొన్ని రకాల మద్యం కంపెనీలతో డైరెక్ట్ గా మాట్లాడుకుని ఎక్కువ మార్జిన్ ఇస్తున్న కంపెనీలకు చెందిన లిక్కర్ ను మాత్రమే ప్రమోట్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది.
సిండికేట్ మాయాజాలం
సిండికేట్ గా ఏర్పడిన కొంతమంది మద్యం అమ్మకం దారులు జగిత్యాల జిల్లాలో తమ హవా కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా జగిత్యాల జిల్లాలో కేఫ్ బ్రాండ్ బీర్ల విక్రయాలను నిలిపివేసిన మద్యం వ్యాపారులు కొత్తరకం లిక్కర్ స్కాం కు తెరలేపారనే విమర్శలను ఎదుర్కొంటున్నారు. అడిగే వారు లేరనే ధీమాతో తమకు కాసులు కురిపించే నాసిరకం బీర్లను విక్రయిస్తున్నారనే ఆరోపణలను మూటగట్టుకుంటున్నారు. అన్ని రకాల ఆల్కాహాల్ బ్రాండ్లను అందుబాటులో ఉంచాల్సింది పోయి పెద్దగా ఆదరణ లేని అధిక లాభాలు వచ్చే కొన్ని బ్రాండ్లను మాత్రమే విక్రయిస్తున్నారని నిర్వాహకుల తీరుపై ఆల్కహాల్ కన్జ్యూమర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు కావాల్సిన పర్టికులర్ బ్రాండ్ మధ్యాన్ని అమ్మడం లేదని ఇతర ప్రాంతాలకు వెళ్లి మరి కొని తెచ్చుకుంటున్నారు వినియోగదారులు. ఈ విషయంలో ఏకంగా ప్రజావాణిలో ఫిర్యాదులు అందగా స్వీకరించిన అధికారులు ఈ సమస్యకు పుల్ స్టాప్ పెట్టే విధంగా ఎలాంటి చర్యలు చేపట్టలేదని విమర్శలు వెలువెత్తుతున్నాయి.
నయా స్కాం
సిండికేట్ గా ఏర్పడిన కొంతమంది మద్యం వ్యాపారులు కొత్త రకమైన స్కాం కు తెరలేపినట్లు స్పష్టమవుతుంది. మద్యం దుకాణాల కోసం లైసెన్స్ దక్కించుకునేందుకు గ్రూపుగా ఏర్పడిన కొంతమంది మద్యం వ్యాపారులు అధికంగా టెండర్లు వేసినట్లు సమాచారం. అయితే వందల సంఖ్యలో టెండర్లు దాఖలు చేయగా పదుల సంఖ్యలో మాత్రమే లైసెన్సులు వచ్చినట్లుగా తెలుస్తుంది. టెండర్లలో నష్టపోయిన డబ్బులు రాబట్టేందుకు సిండికేట్ గా ఏర్పడిన వ్యాపారులు ఆదరణ ఉన్న బ్రాండ్లు కాకుండా డిమాండ్ లేని మధ్యాన్ని అమ్ముతున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. కొన్ని రకాల మద్యం కంపెనీలతో డైరెక్ట్ గా మాట్లాడుకుని ఎక్కువ మార్జిన్ ఇస్తున్న కంపెనీలకు చెందిన లిక్కర్ ను మాత్రమే ప్రమోట్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. కేఎఫ్ కు ప్రత్యామ్నాయంగా అమ్ముతున్న మరో బ్రాండ్ కంపెనీ అదనంగా 3% నుండి 5% అధికంగా కమిషన్ ఇస్తుండడంతో పాపులర్ బ్రాండ్ విక్రయాలను నిలిపివేసినట్లుగా స్పష్టమవుతుంది. అంతేకాకుండా సేల్స్ పెంచిన వ్యాపారులకు సదరు కంపెనీ ఖరీదైన గిఫ్ట్ లతో పాటు సంవత్సరానికి ఒకసారి కోట్లలో ముట్ట చెబుతున్నట్టు సమాచారం. ఓకే బ్రాండ్ కు సంబంధించిన బీర్లను విక్రయిస్తుండడంతో మందుబాబులు సైతం వాటిని కొనక తప్పని పరిస్థితి నెలకొంది.
ఫిర్యాదులు అందినా చర్యలు లేవు
తమకు కావలసిన బ్రాండ్ మధ్యాన్ని షాపులలో అందుబాటులో ఉంచాల్సిందిగా కోరుతూ ఫిర్యాదులు అందినప్పటికీ అధికారులు ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మద్యం ప్రియులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులకు సిండికేట్ గా ఏర్పడిన మద్యం వ్యాపారుల నుండి ప్రతి నెల పెద్ద మొత్తంలో ముడుపులు అందుతున్నాయనే ఆరోపణలు లేకపోలేదు. వైన్ షాపులలో దొరకని కొన్ని రకాల బ్రాండ్లు బెల్ట్ షాపులలో అమ్మకాలు సాగిస్తున్నట్లు సమాచారం. బెల్ట్ షాపులపై కొరడా ఝలిపించాల్సిన అధికారులు మాత్రం కేవలం కెఎఫ్ బ్రాండ్ అమ్మే వారిపై మాత్రమే దాడులు చేస్తూ కేసులు పెడుతున్నారని మిగిలిన వారిపట్ల చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు అన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.