రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదేపని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.
దిశ, సారంగాపూర్: ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదేపని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలతో రైతులు నష్టపోయినపుడు ప్రభుత్వాలే ఆదుకోవాలని.. కానీ, దురదృష్టం ఏంటంటే తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి ప్రభుత్వ పరంగా రైతులను ఆదుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. ఇప్పుడైనా రైతులను ఆదుకోవాలనే ఆలోచన వచ్చినందుకు సీఎం కేసీఆర్ ను అభినందించాల్సిన విషయమేనని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఫసల్ భీమా పథకాన్ని ఇక్కడ కూడా అమలు చేస్తే ఆ పథకం కింద నమోదైన రైతుకు నష్టం జరిగితే బీమా కంపెనీనే పరిహారం చెల్లిస్తుందన్నారు. దీంతో రైతులకు సరైన న్యాయం జరిగేదని అన్నారు. అన్నదాతలను ఆదుకునే బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదేనని అన్నారు. ఒకవేళ కేంద్రం ప్రవేశ పెట్టిన పథకంతో లాభం లేదనుకుంటే రాష్ట్ర ప్రభుత్వమే అంతకు మించి మరో పథకాన్ని ప్రవేశ పెడితే బాగుంటుందని పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎక్కువగా నష్టపోయిన ప్రాంతం బీర్పూర్ మండలమని, అర గుండాల ప్రాజెక్టు వల్ల నష్టపోయిన మత్స్యకారులకు, గంగపుత్రుల కుటుంబాలకు రూ.లక్ష ఆర్థిక సాయం అందించాలని కోరారు.